IND vs AUS: నిరీక్షణకు తెర.. 14 నెలల తర్వాత అర్ధ శతకం బాదిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అర్ధ శతకం బాదాడు. టెస్టుల్లో అతడికిది 29వ హాఫ్‌ సెంచరీ.

Updated : 11 Mar 2023 23:47 IST

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Vriat Kohli) కొంతకాలంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ఆసీస్‌తో  బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. కానీ, అహ్మదాబాద్‌లో ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ అర్ధ శతకం (59) పూర్తి చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకిది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల తర్వాత టెస్టుల్లో విరాట్ హాఫ్‌ సెంచరీ బాదాడు. అతడికిది 15 ఇన్నింగ్స్‌ల తర్వాత మొదటి అర్ధ సెంచరీ కావడం విశేషం.

ఈ మ్యాచ్‌కు ముందు చివరగా 2022 జనవరిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 79 పరుగులు చేశాడు. అనంతరం  15 ఇన్నింగ్స్‌ల్లో 29, 45, 23, 13, 11, 20, 1, 19 నాటౌట్.. 24, 1, 12, 44, 20, 22, 13 హాఫ్ సెంచరీ చేయలేదు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ మరో ఘనత కూడా అందుకున్నాడు. సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత స్వదేశంలో 4000 పరుగులు చేసిన ఐదవ భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. 

ఇక, ఆసీస్‌తో నాలుగో టెస్టు విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ (59 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (16 బ్యాటింగ్‌) నాటౌట్‌గా ఉన్నారు. టీమ్‌ఇండియా ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. శుభ్‌మన్ గిల్ (128) సెంచరీతో ఆకట్టుకోగా.. పుజారా (42), రోహిత్‌ శర్మ (35) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని