Sachin - Virat Kohli: విరాట్‌ సంక్రాంతి సెంచరీ.. మరో 2 సచిన్‌ రికార్డులు బద్దలు

భారత క్రికెట్‌లో సచిన్‌ (Sachin) రికార్డులను కొట్టేయగల ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). తాజాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో (IND vs SL) రెండు శతకాలు సాధించిన కోహ్లీ.. సచిన్‌ రికార్డులను అధిగమించాడు.

Published : 15 Jan 2023 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ సెంచరీ (166*) సాధించాడు. ఈ క్రమంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ పేరుపై ఉన్న రెండు రికార్డులు బద్దలుకొట్టాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలను బాదిన బ్యాటర్‌గా ఇన్నాళ్లూ సచిన్‌ ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి విరాట్‌ వచ్చాడు. తిరువనంతపురంలో విరాట్‌ బాదిన ఈ సెంచరీ సొంత గడ్డపై 21వది కావడం గమనార్హం. 20 సెంచరీలతో సచిన్‌ ఇన్నాళ్లూ ఈ లిస్ట్‌లో టాప్‌1లో ఉన్నాడు. 

ఒకే జట్టుపై అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ రోజు శ్రీలంకపై కొట్టిన సెంచరీ పదవది కావడం గమనార్హం. ఈ సిరీస్‌ తొలి వన్డేలో విరాట్‌ శతకం సాధించి సచిన్‌తోపాటు ఈ జాబితాలో సమంగా (9) నిలిచాడు. ఈ రోజు శతకంతో ఒకడుగు ముందుకేశాడు. ఇక వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా ఉన్న సచిన్ (49)కు విరాట్‌కి (46) మధ్య దూరం ఇంకాస్త తగ్గింది. ఇంకో మూడు వందలు బాదేస్తే సమం... నాలుగోది కూడా కొట్టేస్తే ఏకంగా దాటేస్తాడు. అలా సచిన్‌ మాటను కోహ్లీ నిజం చేసేస్తాడు. 

ఎందుకంటే... కొన్నాళ్ల క్రితం ‘మీ రికార్డులను బద్దలు కొట్టే క్రికెటర్లు ఎవరు అని మీరు అనుకుంటున్నారు’ అని ఓ యాంకర్‌ సచిన్‌ను అడిగితే.. సచిన్‌ చెప్పిన పేర్లలో విరాట్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే. అన్నట్లు ఇదే మ్యాచ్‌లో విరాట్‌ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలోకి వచ్చాడు విరాట్‌. ప్రస్తుతం 12,754 పరుగులు సాధించి శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దెనె (12,650)ను వెనక్కి నెట్టేశాడు. సచిన్‌ (18,426) అందరికంటే అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మరో వెయ్యి పరుగులు చేస్తే విరాట్ మూడో స్థానానికి వచ్చేస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని