Cricket News: కేన్‌ను నెట్టేసిన స్మిత్‌.. విరాట్‌@4

ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టాడు. ఆసీస్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు...

Updated : 17 Jun 2021 02:49 IST

దుబాయ్‌: ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టాడు. ఆసీస్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకుకు ఎగబాకాడు. పరుగులు చేయడంలో విఫలమైన ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.

ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ టెస్టు సిరీసు ముగిసిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్‌ (886 రేటింగ్‌) కేవలం 13 పరుగులే చేశాడు. గాయంతో రెండో టెస్టు ఆడలేదు. ఫలితంగా అతడి రేటింగ్‌ పాయింట్లలో కోత పడింది. 891 రేటింగ్‌తో స్టీవ్‌స్మిత్‌ తిరిగి నంబర్‌ వన్‌గా ఆవిర్భవించాడు. గ్యారీ సోబర్స్‌ (189 టెస్టులు), వివ్‌ రిచర్డ్స్‌ (179 టెస్టులు) తర్వాత ఎక్కువ మ్యాచులు 167 ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు. పరుగులు చేయకుండా నిరాశ పరిచిన ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ 797 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ 814 రేటింగ్‌తో కొనసాగుతున్నాడు. రిషభ్‌ పంత్‌ (797), రోహిత్‌ శర్మ (797) సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ప్రతి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ 307 రేటింగ్‌తో 64వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ కెరీర్‌ బెస్ట్‌ 323 రేటింగ్‌ సాధించాడు. డబుల్‌ సెంచరీ చేసిన డేవాన్‌ కాన్వే బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా 61వ స్థానంలో నిలిచాడు. ప్యాట్‌ కమిన్స్‌ (908), రవిచంద్రన్‌ అశ్విన్‌ (850), టిమ్‌ సౌథీ (830) టాప్‌-3 బౌలర్లుగా  ఉన్నారు. కాగా టాప్‌-10లో యాష్‌ మినహా భారత్‌ నుంచి మరెవ్వరూ లేకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్ల జాబితాలో యాష్‌ 2, జడ్డూ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని