Virat kohli: నా లైఫ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌.. ఆమెను కలిసిన క్షణమే..!

తన భార్య అనుష్క ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందన్నాడు విరాట్‌ కోహ్లీ(Virat kohli). ఆమెను కలిసిన తర్వాతే జీవితాన్ని మరో కోణంలో చూడడం ప్రారంభించానన్నాడు. 

Updated : 11 Mar 2023 12:32 IST

బెంగళూరు: పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ(Virat kohli) , బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka sharma) జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జోడీకి ఇటు క్రికెట్, అటు సినిమా ప్రపంచంలో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరు ఒకరిపైఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అనుష్కను కలిసిన క్షణం తన జీవితమే మారిపోయిందన్నాడు విరాట్‌. అలాగే తన తండ్రి దూరమైన తర్వాత తనలో వచ్చిన మార్పును వెల్లడించాడు.

‘నాకు నా తండ్రి దూరమైన క్షణం.. జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చింది. ఆ ఘటన భవిష్యత్తుపై నా ఆలోచనాధోరణిలో మార్పు తెచ్చింది. అయితే, నా జీవితం మాత్రం మారలేదు. నా చుట్టూ ఉన్న ప్రపంచం మునపటిలాగే ఉంది. నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాను’ అని వెల్లడించిన ఈ స్టార్ బ్యాటర్.. తన జీవితాన్ని మార్చిన సందర్భం  గురించి తెలిపాడు. ‘నా జీవితం మారిన క్షణం ఏంటని అడిగితే.. అనుష్క(Anushka sharma)తో మొదలైన నా పరిచయమనే చెబుతాను. అప్పుడే జీవితంలో మరో కోణం చూశాను. నా ప్రపంచం మునుపటిలా లేదు. మారిపోయిందని అనిపించింది. మీరు ప్రేమలో పడినప్పుడు.. ఆ మార్పులు మీలో కూడా రావడం ప్రారంభమవుతాయి. చాలా విషయాలను అంగీకరించాలి. భవిష్యత్తుల్లో ఇద్దరు కలిసి ప్రయాణించాలి కాబట్టి అందుకు తగ్గట్టుగా మార్పు మొదలవుతుంది. అందుకే ఆమెను కలిసిన క్షణాన్ని లైఫ్ ఛేంజింగ్ మూమెంట్‌గా చెప్తాను’ అంటూ విరాట్(Virat kohli) వెల్లడించాడు. 

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా విరాట్ నాలుగో టెస్టు మ్యాచ్‌ ఆడుతుండగా..  ప్రస్తుతం అనుష్క శర్మ ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ (Chakda Xpress) అనే క్రికెట్‌ బయోపిక్‌లో నటిస్తోంది. మాజీ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి(Jhulan Goswami) జీవితకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విరుష్క (కోహ్లి-అనుష్క) జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు