IND vs SA : విరాట్‌ బ్యాటింగ్ గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదు : విక్రమ్‌ రాఠోడ్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌ ఆడటంపై బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అతడి..

Published : 13 Jan 2022 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌ ఆడటంపై బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అతడి బ్యాటింగ్‌ గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (79) టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

‘భారత జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా నేనెప్పుడూ విరాట్ బ్యాటింగ్ గురించి ఆందోళన చెందలేదు. అతడు నెట్స్‌లో బాగా శ్రమిస్తాడు. దీంతో మైదానంలో మెరుగ్గా రాణించగలుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ చాలా సహనంతో, క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశాడు. సఫారీ బౌలర్లు రకరకాల బంతులతో కోహ్లీని సవాల్ చేశారు. అయినా అతడి ఏకాగ్రత దెబ్బ తినలేదు. సరైన బంతులను ఎంచుకుని కవర్ డ్రైవ్‌లు ఆడాడు. అతడి ఆటతీరు పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను. బ్యాటింగ్‌లో పెద్ద లోపాలు ఏం కనిపించలేదు. పుజారా కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అజింక్య రహానె కూడా వీలైనంత వరకు మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశిస్తున్నాను’ అని విక్రమ్‌ రాఠోడ్‌ పేర్కొన్నాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 223 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, మార్కో జాన్సన్‌ మూడు, అలివీర్, లుంగి ఎంగిడి, కేశవ్‌ మహరాజ్‌ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా 17/1 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం మార్‌క్రమ్‌ (8), కేశవ్‌ మహరాజ్‌ (6) క్రీజులో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా ఇంకా 206 పరుగులు వెనుకబడి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని