Virat Kohli: విరాట్‌ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ

క్రీడల్లో ప్రతి ఆటగాడు ప్రత్యేక జెర్సీ నంబరుతో కన్పిస్తాడు. మన పరుగుల వీరుడు కోహ్లీ నంబరు 18. దీని వెనుక ఓ కన్నీటి గాథ ఉంది తెలుుసా..?

Updated : 26 Mar 2023 10:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli ) పేరు వినగానే.. క్రికెట్‌ అభిమానులకు ‘జెర్సీ నంబరు 18 (jersey Number 18)’ కళ్ల ముందు కదలాడుతుంది. అది ఐపీఎల్‌ అయినా.. అంతర్జాతీయ టోర్నీ అయినా కోహ్లీ ఆ జెర్సీ నంబరులోనే కన్పిస్తాడు. తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కింగ్‌ తన సంఖ్యను మార్చుకోలేదు. అయితే దీని వెనుక ఓ ఉద్వేగభరిత కథ ఉంది. తన తండ్రి  గుర్తుగా కోహ్లీ.. ‘నంబరు 18 (jersey Number 18)’ జెర్సీ మాత్రమే వేసుకుంటున్నాడు.

కోహ్లీ (Virat Kohli ) 17 ఏళ్ల వయసులో అతడి తండ్రి ప్రేమ్‌ కోహ్లీ 2006 డిసెంబరు 18వ తేదీ తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో దిల్లీ తరఫున కర్ణాటకతో కోహ్లీ ఓ రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఓ పక్క తండ్రి మరణించినా.. కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో దుఃఖాన్ని దిగమింగుకుని కోహ్లీ.. ఆ రోజు మ్యాచ్‌ ఆడి ఏకంగా 90 పరుగులు చేశాడు. ఆ రోజు మ్యాచ్‌ ముగిశాక తండ్రి అంత్యక్రియలకు పాల్గొన్నాడు. తండ్రి మరణం తర్వాత మ్యాచ్‌ ఆడటంపై కోహ్లీ స్పందిస్తూ.. ఆ క్షణం తాను వ్యక్తిగా మారానని, కఠిన నిర్ణయం తీసుకున్నానని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. అందుకే తన తండ్రి మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నంబరు 18 (jersey Number 18)ని ఎంచుకున్నాడు.

ఇక అండర్‌ 19 జట్టులో చేరినప్పుడు తొలుత కోహ్లీ (Virat Kohli )కి జెర్సీ నంబరు 44ను కేటాయించారట. అయితే కొన్నాళ్లకు అతడు జెర్సీ నంబరు 18కి మారాడు. అదే నంబరుతో అండర్‌ 19 జట్టుకు సారథిగా భారత్‌కు ప్రపంచకప్‌ అందించాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ టీమిండియా జట్టులో చేరేనాటికి అదృష్టవశాత్తూ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా విరాట్‌కు ఆ నంబరు దక్కింది. ఇక నాటి నుంచి కోహ్లీ అదే నంబరుతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 

ఈ నంబరుకు మరో ప్రత్యేకత కూడా ఉందట. కోహ్లీ తండ్రి ప్రేమ్‌ తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో జెర్సీ నంబరు 18నే వేసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం కోహ్లీ కూడా ఇప్పటికీ అదే నంబరుతో కన్పిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని