Virat Kohli: ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తాం: గంగూలీ

సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా మాజీ కెప్టెన్‌, కీలక బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ.. కొన్ని రోజుల పాటు ఆట నుంచి విశ్రాంతి తీసుకోవాలని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి

Published : 16 Aug 2022 11:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా మాజీ కెప్టెన్‌, కీలక బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ.. కొన్ని రోజుల పాటు ఆట నుంచి విశ్రాంతి తీసుకోవాలని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. వచ్చే ఆసియా కప్‌లో మునుపటి కోహ్లీని చూస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన గంగూలీ.. కోహ్లీ ఫామ్‌ గురించి స్పందించారు. ‘‘అతన్ని(కోహ్లీ) ప్రాక్టీస్‌ చేయనివ్వండి.. మ్యాచ్‌లు ఆడనివ్వండి. అతడు చాలా గొప్ప ప్లేయర్‌. వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే పుంజుకుంటాడు. సెంచరీలు చేయలేకపోవచ్చు కానీ.. ఆసియా కప్‌లో అతడిలో మునపటి ఫామ్‌ను చూస్తామని నేను విశ్వాసంగా ఉన్నా’’ అని గంగూలీ చెప్పుకొచ్చారు.

కోహ్లీ బ్యాటింగ్‌పై గత కొంతకాలంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. 2019 నవంబరు తర్వాత నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విరాట్‌.. అర్ధసెంచరీలకు కూడా కష్టపడాల్సి వస్తోంది. దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కోహ్లీ ఆడాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌ సిరీస్‌లో అతడికి విశ్రాంతి కల్పించారు. ఆగస్టు 27 నుంచి జరిగే ఆసియా కప్‌ టోర్నీకి అతడిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో జరిగే జింబాబ్వే పర్యటనలో కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని