Virat Kohli: మరోసారి కోహ్లీ స్వర్ణ యుగం ఖాయం: పాక్‌ మాజీ కెప్టెన్‌

విరాట్‌ మరోసారి అభిమానులకు కనువిందు చేయనున్నాడని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరోసారి విరాట్‌ క్రికెట్‌ స్వర్ణయుగంలోకి అడుగుపెడతాడని జోస్యం చెప్పాడు.

Published : 06 Feb 2023 11:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ (Virat Kohli) కెరీర్‌లో మరోసారి స్వర్ణయుగం రానుందని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక స్టార్‌ ఆటగాడు సంగక్కర కెరీర్‌ లాగే విరాట్‌ (Virat Kohli) భవిష్యత్తు కూడా ఉండనుందని జోస్యం చెప్పాడు. భట్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ‘‘భవిష్యత్తులో విరాట్‌ (Virat Kohli) అత్యుత్తమ ఆట మరోసారి కనువిందు చేయనుంది. విరాట్‌ ఇప్పటికే స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఇంకా అతడి స్థాయి ఆటను అందుకోలేదు. అతడి కెరీర్‌లోని స్వర్ణయుగంలో అన్‌స్టాపబుల్‌ మాదిరిగా ఆడాడు. మీరు కుమార సంగక్కర కెరీర్‌ను చూడండి. అతడు కెరీర్‌ చివరి రోజుల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. కానీ, కుర్రాడిగా ఉన్నప్పుడు అంత గొప్పగా ఆడలేకపోయాడు. చాలా ఆటగాళ్ల కెరీర్‌లో ఇది చోటు చేసుకొంది’’ అని విశ్లేషించాడు. 

‘‘ఆధునిక క్రికెట్‌లో మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మోతాదుకు మించిన మ్యాచ్‌లు ఆటగాడిపై ప్రభావం చూపిస్తాయి. తెలివైన ఆటగాళ్లు వారికి సరిపడా ఫార్మాట్‌ను ఎంచుకొని దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక్క సారి ఆ పనిచేస్తే.. అతడి ఆట అదే స్థాయిలో కొనసాగుతుంది. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది కోహ్లీనే (Virat Kohli). అతడి కెరీర్‌లో మరోసారి స్వర్ణయుగం వస్తుందనుకొంటున్నా’’ అని సల్మాన్‌ భట్‌ సూచించాడు.

గతేడాది ఆసియాకప్‌ ముందు వరకు శతకం కోసం కోహ్లీ (Virat Kohli) సుదీర్ఘ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌పై 122 పరుగులు చేసిన తర్వాత అతడి ఆటతీరు ఒక్కసారిగా మారిపోయింది. మునుపటి లయను అందిపుచ్చుకొని పరుగుల వరదను పారించాడు. మూడు వన్డే శతకాలు నమోదు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని