Virat Kohli: విరాట్ వన్డే ‘సెంచరీల’ కింగ్‌.. ఐపీఎల్‌కు ముందే అయిపోతాడా..?

టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు (IND vs NZ) సిద్ధమైపోయాడు. 

Updated : 17 Jan 2023 16:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పరుగుల రారాజు.. కింగ్‌ కోహ్లీ.. ‘సంక్రాంతి’ పందెం కోడి అనిపించుకొన్న ఆటగాడు టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). దాదాపు రెండున్నరేళ్లపాటు భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయిన కోహ్లీ.. ఆర్నెల్ల నుంచి మాత్రం వీరబాదాడు మొదలెట్టాడు. గత ఆసియా కప్‌ నుంచి ప్రారంభమైన అతడి బ్యాటింగ్‌ వీరవిహారం కొనసాగుతూనే ఉంది. గత నాలుగు వన్డేల్లో మూడు శతకాలు బాది భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin) ‘శత’ శతకాల రికార్డును పక్కనపెడితే, వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ ఎప్పుడు అధిగమిస్తాడు..?

సచిన్‌ వన్డేల్లో 49 సెంచరీలు బాదాడు. అదీనూ 463 ఇన్నింగ్స్‌లు తీసుకొన్నాడు. ఇక విరాట్ అయితే కేవలం 266 ఇన్నింగ్స్‌ల్లోనే 46 శతకాలు బాదాడు. ఇంకో మూడు సెంచరీలు చేస్తే సచిన్‌కు సమంగా నిలుస్తాడు. నాలుగు పూర్తి చేసేస్తే వన్డే చరిత్రలో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అవతరిస్తాడు. కోహ్లీ ఫామ్‌ను చూస్తే ఇది పెద్ద కష్టమేం కాదు. ఈ ఏడాదిలోనే భారీగా వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి.  ప్రస్తుతం న్యూజిలాండ్‌తో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ ఆడబోతోంది. కివీస్‌పై విరాట్ కోహ్లీకి మంచి రికార్డే ఉంది. 26 మ్యాచుల్లో 5 శతకాలు, 8 అర్ధశతకాలు సాధించి 1,378 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 94.64 కాగా.. సగటు 59.91తో ఉన్నాడు. ఈ సిరీస్‌లో మరో రెండు శతకాలు చేస్తే రికీ పాంటింగ్‌ (6), వీరేంద్ర సెహ్వాగ్‌ (6) రికార్డును విరాట్ అధిగమిస్తాడు. 

ఆ తర్వాత ఆసీస్‌తోనూ..

న్యూజిలాండ్‌ మీద వరుసగా మూడు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డును విరాట్‌ సమం చేస్తాడు. అప్పుడు ఒక్క సెంచరీ మాత్రమే ‘50’కి బాకీ ఉంటుంది. కివీస్‌తో సిరీస్‌ల తర్వాత ఆస్ట్రేలియా భారత్‌కు రానుంది. ఫిబ్రవరి - మార్చి నెలలో నాలుగు టెస్టులతోపాటు మూడు వన్డేలను భారత్‌ ఆడనుంది. ఆ తర్వాత ఐపీఎల్‌ ఉంటుంది. అంటే ఆలోపే టీమ్‌ఇండియా ఆరు వన్డేల్లో తలపడనుంది. విరాట్ ఫామ్‌ను చూస్తే మాత్రం  ఆరు వన్డేల్లో నాలుగు సెంచరీలు సాధించడం అసాధ్యమేం కాదు. ఎందుకంటే గత నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు కొట్టిన ఘనత విరాట్ సొంతం. ఆసీస్‌ పర్యటన ముగిసిన తర్వాత ఐపీఎల్‌ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ కూడా ఉన్నాయి. అయితే ఆసీస్‌తో సిరీస్‌లోపే విరాట్ వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డును ముగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అప్పుడే మెగా టోర్నీల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు వీలుంటుందనేది వారి భావన. 

‘వంద’ వందలు అవ్వాలంటే.. 

అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో వంద శతకాలు (అన్ని ఫార్మాట్లు కలిపి) కొట్టడమంటే సాధారణ విషయం కాదు. అయితే సచిన్‌ దానిని పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ రికార్డు వేటలోనూ ఉన్న ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే. ప్రస్తుతం టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లలో కలిపి 74కి చేరాయి. మరో 26 కొడితే వంద పూర్తి కావడం ఖాయం. అలా జరగాలంటే ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను కొనసాగించాలి. అయితే క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ చెప్పినట్లుగా.. కనీసం ఐదారేళ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరాట్ భీకర ఫామ్‌తో ఇంకో 50 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును కొట్టేయడం సాధ్యమేనని క్రికెట్‌ విశ్లేషకుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని