Virat Kohli: ఆ సెంచరీ సాధించాక.. అలా అనుకున్నా: విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో ముందువరుసలో ఉంటాడు. అయితే అతడూ తన ఫామ్‌ను కోల్పోయి దాదాపు మూడేళ్లపాటు ఇబ్బంది పడ్డాడు. సెంచరీ చేయలేక విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది అఫ్గాన్‌పై పొట్టి ఫార్మాట్‌లో సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.

Published : 13 May 2023 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్‌లో దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ లేకుండా మ్యాచ్‌లను ఆడాడు. అర్ధశతకాలు సాధించినా.. వాటిని శతకాలుగా మార్చడంలో మాత్రం విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో దాదాపు నెల రోజులపాటు క్రికెట్‌కు విరామం ఇచ్చి మరీ మైదానంలోకి దిగాడు. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ టోర్నీలో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో తొలి శతకం కూడా అదే కావడం విశేషం. ఇది విరాట్‌కు 71వ అంతర్జాతీయ శతకం. ఇక ఆ తర్వాత వన్డేల్లోనూ వెనువెంటనే సెంచరీలు బాదాడు. ఈ క్రమంలో డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే ‘లెట్‌ దేర్‌ బి స్పోర్ట్’ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఆ సెంచరీని గుర్తు చేసుకున్నాడు. 

‘‘నేను 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు.. ఒకటే అనుకున్నా.. ఎలాగైనా సెంచరీ సాధించాలి.  తర్వాత బంతిని సిక్స్‌గా మలిచా. శతకం పూర్తి కాగానే అతి కష్టంగా నవ్వగలిగా. ఎందుకంటే దాదాపు రెండేళ్లకుపైగా దీని కోసమే కదా నేను వేచి చూశాను. ఇందుకేనా నేను బాధపడింది అని అప్పుడు అనిపించింది’’ అని కోహ్లీ తెలిపాడు. సచిన్‌ వంద సెంచరీల రికార్డును అధిగమించాలంటే విరాట్ ఇంకా 25 శతకాలు చేయాలి. ప్రస్తుతం 75 శతకాలు (వన్డేల్లో 46, టెస్టులు 28, టీ20ల్లో ఒకటి) సాధించాడు. వన్డేల్లో మరో నాలుగు చేస్తే సచిన్‌ (49 సెంచరీలు) రికార్డును  అధిగమిస్తాడు. వన్డే ప్రపంచ కప్‌, ఆసియా కప్‌ నేపథ్యంలో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడం విరాట్‌కు పెద్దగా కష్టం కాదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ ఫామ్‌తో ఉన్నప్పటికీ.. తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని