SAHA : సాహా.. గట్టిగా ఊపిరి పీల్చుకో.. అతడి పేరు చెప్పేసేయ్‌: సెహ్వాగ్‌

ఇంటర్వ్యూ కోసం ఓ పాత్రికేయుడు బెదిరింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు..

Updated : 23 Feb 2022 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంటర్వ్యూ కోసం ఓ పాత్రికేయుడు బెదిరింపులకు పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసిన టీమ్‌ఇండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహాకు వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి మద్దతుగా నిలిచాడు. అయితే పాత్రికేయుడి పేరును వెల్లడించాలని ట్విటర్ వేదికగా సాహాకు సూచించాడు. ‘‘డియర్ వృద్ధి.. ఇతరులకు కీడు చేయాలనే స్వభావం నీది కాదని తెలుసు. నువ్వొక అద్భుతమైన వ్యక్తివి. భవిష్యత్తులో ఎవరికీ ఇలాంటి అనుభవాలు ఎదురు కాకుండా ఉండాలంటే అతడి (పాత్రికేయుడు) పేరు చెప్పాలి. అందు కోసం గట్టిగా ఊపిరి పీల్చుకొని మరీ జర్నలిస్ట్‌ పేరు చెప్పేసెయ్‌’’ అని సెహ్వాగ్‌ ట్వీట్ చేశాడు.

అసలు ఇదీ జరిగింది.. 

శ్రీలంకతో సిరీస్‌కు వృద్ధిమాన్ సాహాను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో తనను రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచించాలని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ సూచించాడని సాహా తెలిపాడు. అలానే కొద్ది రోజుల కిందట ఇంటర్వ్యూ కోసం ఓ పాత్రికేయుడు బెదిరింపు ధోరణిలో సందేశాలను పంపాడని వృద్ధిమాన్‌ సాహా సామాజిక మాధ్యమాల్లో స్క్రీన్‌షాట్లను షేర్‌ చేశాడు. దీంతో సాహాకు సర్వత్రా మద్దతు వెల్లువెత్తింది. దీనిపై విచారణ జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే సదరు పాత్రికేయుడి పేరును బీసీసీఐ అడిగినా చెప్పనని సాహా స్పష్టం చేశాడు. అతడి కెరీర్‌కు నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. సాహాకు ఓ పాత్రికేయుడు బెదిరింపు ధోరణిలో సందేశం పంపడాన్ని భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తీవ్రంగా ఖండించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని