Virender Sehwag: శుభ్‌మన్‌కు స్వేచ్ఛనిచ్చి.. పరుగులు రాబట్టాలి: సెహ్వాగ్

గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ రాణించాలంటే ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, యాజమాన్యం వెన్నుతట్టి ప్రోత్సహించాలని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు...

Updated : 06 May 2022 14:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ రాణించాలంటే ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, యాజమాన్యం వెన్నుతట్టి ప్రోత్సహించాలని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ యువ బ్యాట్స్‌మన్‌ ఇష్టమొచ్చినట్లుగా ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలని.. ఫలితంగా పరుగులు రాబట్టేలా చూడాలని చెప్పాడు. గిల్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ల్లో డకౌటయ్యాక తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో 84, 96 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే, ఆ తర్వాత మరో పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌పై స్పందించిన సెహ్వాగ్‌ గుజరాత్‌ జట్టుకు పలు విషయాలు సూచించాడు.

‘‘నీకు ఎలా వీలైతే అలా ఆడు. నీ నుంచి మాకు పరుగులు కావాలి. నువ్వు 120 స్ట్రైక్‌రేట్‌తో ఆడాతావా లేదా 150 స్ట్రైక్‌రేట్‌తో ఆడతావా అనేది నీ ఇష్టం’ అని జట్టు యాజమాన్యం అతడికి చెప్పి చూడాలి. గిల్‌ ఒకవేళ 7-8 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తే తర్వాత వచ్చే డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా వంటి హిట్టర్లకు పని తేలికవుతుంది. ఒకవేళ అలాకాకుండా గతమ్యాచ్‌లో వలే వీళ్లు ముందే బ్యాటింగ్ చేయడానికి వస్తే ఇబ్బంది పడతారు. దూకుడుగా ఆడాలా లేదా డిఫెండింగ్‌ చేయాలా అనే డైలామాలో పడతారు. గుజరాత్‌ టాప్‌ ఆర్డర్‌ 10 ఓవర్లకు 80 పరుగులు సాధిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌ మిగతా 10 ఓవర్లలో 120 పరుగులు చేయగలుగుతారు’’ అని సెహ్వాగ్‌ వివరించాడు.

అలాగే గుజరాత్‌ గతమ్యాచ్‌లో మాదిరి టాస్‌ గెలిస్తే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొని ప్రయోగాలు చేయొద్దని కూడా వీరూ సూచించాడు. ఈరోజు ముంబయితో ఆడే మ్యాచ్‌ బ్రబౌర్న్‌ స్టేడియంలో జరుగుతుందని, అక్కడ బౌండరీ లైన్‌ దగ్గరగా ఉండటంతో లక్ష్య ఛేదన తేలికవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి ఏ గేమ్‌ని కూడా తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి మ్యాచ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరాడు. కాగా, గుజరాత్‌ గత మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడిన సందర్భంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొంది. అయితే, బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో 143/8 స్కోర్‌తో సరిపెట్టుకొంది. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్‌ ఆ జట్టుకు పలు సూచనలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని