KKR:కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని రిటైన్‌ చేసుకుంటుంది: సెహ్వాగ్‌

ఐపీఎల్-14 సీజన్‌ తొలి అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఏడు మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే అని అంతా ఫీక్సయిపోయారు. కానీ, యూఏఈలో  జరుగుతున్న రెండో అంచెలో కేకేఆర్‌ దశ తిరిగింది.

Published : 16 Oct 2021 01:53 IST


(Photo: KKR Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌ తొలి అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఏడు మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే అని అంతా ఫీక్సయిపోయారు. కానీ, యూఏఈలో  జరుగుతున్న రెండో అంచెలో కేకేఆర్‌ దశ తిరిగింది. అక్కడ ఆడిన ఏడు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఐదు విజయాలను నమోదు చేసుకుని అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కి దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరును చిత్తుచేసిన కోల్‌కతా.. క్వాలిఫయర్‌-2లో దిల్లీని ఓడించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అయితే, రెండో అంచెలో కోల్‌కతా జట్టులో సాధించిన విజయాల్లో ఒక ఆటగాడు కీలకపాత్ర పోషించాడు. అతడే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ వెంకటేశ్ అయ్యర్‌. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిలకడగా పరుగులు సాధిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. దిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్‌ అయ్యర్‌పై  భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో వెలుగులోకి ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్‌ ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చని పేర్కొన్నాడు. కోల్‌కతా ఫైనల్స్‌కు చేరడానికి ఇతను కూడా కారణం అని వివరించాడు. 

‘ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్ ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు. కేకేఆర్‌ పుంజుకోవడంలో ఈ ఆటగాడిది కీలకపాత్ర. జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు.  భారత జట్టు యాజమాన్యం,సెలెక్టర్లు ఇతని ప్రదర్శనను చూసి ఐపీఎల్‌ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌ కోసం యూఏఈలోనే ఉండాలని కోరారు. ఒకవేళ ఎవరైనా గాయపడితే లేదా హార్దిక్‌ పాండ్యకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టులోకి రావొచ్చు. కోల్‌కతా కొంతమంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవాలనుకుంటే ఈ ఆటగాడు కూడా పోటీదారులలో ఒకడిగా ఉంటాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ని కేకేఆర్‌ రిటైన్‌ చేసుకుంటుందని భావిస్తున్నా’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు