IPL 2023: సెహ్వాగ్‌ టాప్‌-5 బ్యాటర్లు వీరే.. లిస్ట్‌లో లేని విరాట్, గిల్!

ఐపీఎల్‌ (IPL 2023) సీజన్‌లో రాణించిన టాప్‌ - 5 బ్యాటర్ల జాబితాను వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. ఎక్కువగా మిడిలార్డర్‌ బ్యాటర్లకే ప్రాధాన్యం ఇచ్చాడు.

Published : 27 May 2023 14:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్‌ మాత్రమే మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ - గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్ల మధ్య ఆదివారం టైటిల్‌ పోరు జరగనుంది. దాదాపు రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ సీజన్‌లో కొందరు సీనియర్లతోపాటు కుర్రాళ్లు అదరగొట్టగా.. మరికొందరు విఫలమయ్యారు. శుభ్‌మన్‌ గిల్ (851) ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో దూసుకుపోయాడు. ఇప్పుడు అతడి వద్దే ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. ఈ సీజన్‌లో మూడు సెంచరీలు బాదేశాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా రెండు సెంచరీలు సాధించాడు. డుప్లెసిస్‌ కూడా టాప్‌ స్కోరర్‌లో ఒకడు. రుతురాజ్‌ గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, వీరెవరూ టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ టాప్ బ్యాటర్ల జాబితాలో లేరట. సెహ్వాగ్‌ స్వయంగా తన లిస్ట్‌ను ప్రకటించాడు. ఇందులో ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు ఉండటం విశేషం. 

‘‘బ్యాటింగ్‌ విభాగంలో పంచ పాండవులు ఎవరు అనే దానికి సమాధానం ఇస్తున్నా. ఐపీఎల్‌లో చాలా మంది అత్యుత్తమంగా ఆడారు. కానీ, వీరిలో టాప్‌ -5 బ్యాటర్లను ఎంచుకోవాలంటే మాత్రం తొలుత ఓపెనర్ల జోలికి పోను. వారికి చాలా అవకాశాలు వచ్చాయి. అందుకే నా జాబితాలో తొలి ఆటగాడు రింకు సింగ్‌ (అన్‌క్యాప్‌డ్). దీనికి కారణం ఏంటనేది మీరు అడుగుతారని అనుకోను. వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించడం మరెప్పుడూ జరగకపోవచ్చు. రింకు సింగ్‌ వల్లే సాధ్యమైంది. మరో మిడిలార్డర్‌ బ్యాటర్ శివమ్ దూబే. అతడు ఈ సీజన్‌లో 33 సిక్స్‌లు బాదాడు. స్ట్రైక్‌రేట్‌ 160కిపైగా ఉంది. గత సీజన్ల సంగతి పక్కనపెడితే ఈసారిమాత్రం స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగాడు. 

ఇక నా మూడో బ్యాటర్ మాత్రం అద్భుతమైన ఓపెనర్. రాజస్థాన్‌ సంచలనం యశస్వి జైస్వాల్ (అన్‌క్యాప్‌డ్). అతడి అద్భుతమైన ఆటతీరే నన్ను ఎంపిక చేసుకొనేలా చేసింది. ఆ తర్వాత మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌. ఈ సీజన్‌ ముందు వరకు ఫామ్‌లో లేని సూర్య అంతర్జాతీయ క్రికెట్‌లో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ ఆరంభంలోనూ రాణించలేకపోయాడు. ఒక్కసారి జోరు అందుకున్నాక చెలరేగిపోయాడు. చివరిగా మరో మిడిలార్డర్‌ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ను ఎంచుకుంటా. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఆడిన క్లాసెన్‌ ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టగల సత్తా విదేశీ ఆటగాళ్లలో అరుదుగా చూస్తాం. ఆ కేటగిరీకి చెందిన ప్లేయర్‌ క్లాసెన్’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని