Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 వన్డే ప్రపంచకప్ (2007 World Cup)లో బలమైన జట్టుగా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా అనుహ్యంగా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. టీమ్‌ఇండియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడం తనను ఎంతో బాధించిందని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ, కొన్ని ఓటములు ఆటగాళ్లను ఎంతో మానసిక వేదనకు గురిచేస్తాయి. ఆ పరాజయాల బాధను మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag)కు కూడా ఇలాంటి అనుభవమే ఓ సారి ఎదురైంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 వన్డే ప్రపంచకప్ (2007 World Cup)లో బలమైన జట్టుగా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా అనుహ్యంగా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. టీమ్‌ఇండియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడం తనను ఎంతో బాధించిందని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆ ఓటమి బాధతో రెండు రోజులపాటు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదని గుర్తు చేసుకున్నాడు.
గ్రూప్ దశలోనే నాకౌట్ అయిన తర్వాత భారత్‌కు తిరిగి వెళ్లడానికి రెండు రోజుల వరకు తమ వద్ద టిక్కెట్లు లేవని, ఆటగాళ్లందరూ, సహాయక సిబ్బంది రెండు రోజుల పాటు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘2007 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టడం ఎంతో బాధించింది. ఎందుకంటే 2007లో మా జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు. కాగితంపై మీరు మెరుగైన జట్టు కోసం చూసిన ప్రపంచకప్‌కు ముందు లేదా తర్వాత మీకు అది కనిపించదు. అంతకుముందు ఎడిషన్ (2003)లో మేము ఫైనల్ ఆడాం. ఈ ఘోర పరాజయం తర్వాత 2011లో ప్రపంచకప్ గెలిచాం. కానీ అది ఈ జట్టు కాదు. 2007లో మేము మా మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోవడం చాలా బాధించింది’ అని సెహ్వాగ్ అన్నాడు.
‘‘మరింత బాధ కలిగించే విషయం ఏంటంటే.. భారతదేశం తదుపరి రౌండ్‌కు వెళుతుందని అందరూ భావించారు. అనుహ్యంగా గ్రూప్ దశలో నిష్క్రమించడంతో రెండు రోజుల విరామం దొరికింది. భారత్‌కు బయలుదేరుదామంటే మాకు టిక్కెట్లు లేవు. దీంతో మరో రెండు రోజులు ట్రినిడాడ్ అండ్ టొబాగోలో వేచి ఉండాల్సి వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. నా గదిలో రూం సర్వీస్ చేసేవాళ్ళెవరూ లేరు. హౌస్ కీపింగ్ కోసం పిలవలేదు. నేను కూడా నా గది నుంచి బయటకి అడుగు పెట్టలేదు. అప్పుడు ‘ప్రిజన్ బ్రేక్’ సిరీస్ చూశాను. ఆ సమయంలో ఎవరి ముఖం కూడా చూడలేదు’’ అని సెహ్వాగ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.