Published : 26 May 2022 01:17 IST

Sehwag : అప్పుడు కుంబ్లే మద్దతుగా నిలిచాడు.. లేకుంటే టెస్టు కెరీర్‌ ముందే ముగిసేది: సెహ్వాగ్

ఇంటర్నెట్ డెస్క్: ఏ ఫార్మాటైనా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించడమే టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు తెలుసు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు శుభారంభాలను అందించాడు. టెస్టుల్లో రెండు ద్విశతకాలను బాదాడు. ఈ క్రమంలో 2007/2008 సీజన్‌లో భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగా జరిగిన సంఘటనను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. తనకు మద్దతుగా నిలిచిన అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పిన విషయాలను ఓ క్రీడా ఛానెల్‌లో ప్రత్యేక చర్చ సందర్భంగా సెహ్వాగ్‌  వెల్లడించాడు. ‘‘అదే సమయంలో సెలెక్టర్లు నన్ను పక్కన పెడుతూ వస్తున్నారు. దీంతో నేను టెస్టు జట్టులో భాగం కాలేకపోతానేమోననే బాధ వెంటాడింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో 10వేలకుపైగా పరుగులు చేయాలనేది నా కోరిక. అందుకే జట్టు నుంచి ఉద్వాసన ఉండకూడదని భావించా’’ అని తెలిపాడు. ఆసీస్‌ టూర్‌లో తొలి రెండు టెస్టులకు సెహ్వాగ్‌కు చోటు దక్కలేదు. ఆ రెండింట్లోనూ భారత్ ఓడింది. పెర్త్ టెస్టు సందర్భంగా సెహ్వాగ్‌ టీమ్‌లోకి వచ్చాడు. టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. పెర్త్‌ టెస్టుకు ముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 50 కొడితే జట్టులో స్థానం కల్పిస్తానని కెప్టెన్‌ అనిల్ కుంబ్లే చెప్పినట్లు గుర్తు చేసుకొన్నాడు. అయితే వార్మప్‌లోనే శతకం బాదేయడంతో సెహ్వాగ్‌కు పెర్త్‌ టెస్టులో అవకాశం దక్కింది. 

ఇక అడిలైడ్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్‌ 63 పరుగులు సాధించాడు. ఇవెంతో కీలకమైన పరుగులు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అయితే వీర విహారం చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడి 151 పరుగులు సాధించాడు. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 63 పరుగులే నా క్రికెట్ జీవితంలో అత్యంత కష్టతరమైనవి. అనిల్ కుంబ్లే నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము కాకూడదని మాత్రమే ఆ ఇన్నింగ్స్‌ ఆడా. నన్ను జట్టులోకి తీసుకొన్నందుకు ఎవరూ అనిల్ కుంబ్లేని ప్రశ్నించకూడదనేదే నా భావన. స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌పై దృష్టిపెట్టేవాడిని. నాన్‌-స్ట్రైకింగ్‌లో ఉంటే మాత్రం అంపైర్‌తో మాట్లాడటం, హిందీ సాంగ్స్‌ను హమ్మింగ్‌ చేసేవాడు. దీంతో నాపై ఒత్తిడి లేకుండా చూసుకున్నా’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. 

ఆసీస్‌ పర్యటన ముగిశాక సెహ్వాగ్‌కు అనిల్ కుంబ్లే ఓ వాగ్దానం చేశాడట. ‘‘తాను ఎప్పటి వరకైతే టెస్టు జట్టు సారథిగా ఉంటాడో నన్ను జట్టు నుంచి తప్పించడమనేది జరగదని చెప్పాడు. ఓ ఆటగాడిపై కెప్టెన్‌ ఇంత నమ్మకం పెట్టుకుంటే సహజరీతిలో చెలరేగిపోతారు. ఇలాంటి మద్దతే ప్రారంభంలో సౌరభ్‌ గంగూలీ నుంచి అందింది. తర్వాత కుంబ్లే నుంచి పొందాను’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ సందర్భంగానే హర్భజన్‌-సైమండ్స్‌ వివాదం రేగింది. హర్భజన్‌పై మ్యాచ్‌ నిషేధమూ పడింది. ఆ సమయంలో అనిల్ కుంబ్లే సారథిగా లేకపోతే హర్భజన్‌ కెరీర్‌ ముగిసేదని, ఆ సిరీస్‌ను కూడా అర్ధంతరంగా ఆపేసి భారత్‌కు తిరుగుముఖం పట్టాల్సి వచ్చేదని సెహ్వాగ్‌ అన్నాడు. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని