క్రికెట్ నిబంధనల్లో మార్పు.. అశ్విన్‌కి ఫుల్ ఫ్రీడమ్‌ వచ్చేసినట్లే!: సెహ్వాగ్‌

టెస్టు క్రికెట్లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ రికార్డును బద్దలు కొట్టిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కి మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. దాంతో పాటు క్రికెట్‌ నిబంధనల్లో..

Published : 10 Mar 2022 02:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు క్రికెట్లో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ రికార్డును బద్దలు కొట్టిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కి మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో పాటు క్రికెట్‌ నిబంధనల్లో మార్పు చేయడంతో అశ్విన్‌ మరింత స్వేచ్ఛ దొరికినట్లయిందని సరదాగా ట్వీట్‌ చేశాడు.

క్రికెట్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎమ్‌సీసీ) తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. సవరించిన నిబంధనల ప్రకారం.. ఇప్పటి వరకు అన్‌ఫెయిర్‌ ప్లే విభాగంలో ఉన్న ‘మన్కడ్‌’ ఔట్ విధానాన్ని రనౌట్‌ కేటగిరీలోకి మార్చారు. తాజా మార్పులు అక్టోబరు 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ‘కంగ్రాట్యులేషన్స్‌ అశ్విన్‌.. ఈ వారం నీకు బాగా కలిసొచ్చింది. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించావు. బట్లర్‌తో కలిసి రనౌట్లను ప్లాన్‌ చేయడానికి మరింత స్వేచ్ఛ లభించింది’ అని సెహ్వాగ్‌ ట్వీట్ చేశాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2019 సీజన్‌లో రవిచంద్రన్‌ అశ్విన్ కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్, జోస్‌ బట్లర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పంజాబ్, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచులో అశ్విన్ బౌలింగ్‌ చేస్తుండగా‌.. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ క్రీజు దాటి ముందుకు రావడంతో అతడిని ఔట్ చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే, ఎప్పటికప్పుడూ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వచ్చాడు. తను చేసిన దాంట్లో తప్పేం లేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్‌ని రాజస్థాన్‌ రాయల్స్ జట్టు రూ.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్‌లో అశ్విన్‌, జోస్ బట్లర్‌ ఒకే జట్టు తరఫున ఆడనుండటం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని