VVS Laxman: లక్ష్మణ్‌-ద్రవిడ్‌ అంటే ఈడెన్‌ ఒక్కటే కాదు.. అడిలైడ్‌ కూడా

వీవీఎస్‌ లక్ష్మణ్‌.. మణికట్టు స్పెషలిస్టు.. కంగారూ బౌలర్లకు అదరని, బెదరని గుండె ధైర్యం. క్రీజులో నిలిచాడంటే ఆసీస్‌ ఆధిపత్యానికి బ్రేక్‌ వేశాడనే అర్థం...

Published : 02 Nov 2021 12:20 IST

ఆసీస్‌ గడ్డపై వెరీ వెరీ స్పెషల్‌ బ్యాటింగ్‌..

వీవీఎస్‌ లక్ష్మణ్‌.. మణికట్టు స్పెషలిస్టు.. కంగారూ బౌలర్లపై అదరని, బెదరని గుండె ధైర్యం. క్రీజులో నిలిచాడంటే ఆసీస్‌ ఆధిపత్యానికి బ్రేక్‌ వేశాడనే అర్థం. టెస్టు క్రికెట్‌లో 1990, 2000 దశకాల్లో ఆస్ట్రేలియా మేటి జట్టనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ జట్టు బౌలర్లను చూసి ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా కాస్త ఆలోచించి బ్యాటింగ్‌ చేయాల్సిన పరిస్థితులు. కానీ, ఆ దూకుడుకు కళ్లెం వేసింది లక్ష్మణ్‌-ద్రవిడ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2000లో తొలిసారి కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో సంచలన బ్యాటింగ్‌తో అపురూప విజయాన్ని అందించిన వీరిద్దరూ.. 2003లో మరోసారి ఆసీస్‌ సొంతగడ్డపైనే చెలరేగిపోయారు. అడిలైడ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌-రాహుల్‌ ద్రవిడ్‌ మరోసారి తమ బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. అయితే, ఈ మ్యాచ్‌ గురించి కొంతమందికే తెలిసినా.. చాలా మంది మర్చిపోయి ఉంటారు. టీమ్‌ఇండియా సాధించిన గొప్ప విజయాల్లో ఒకటైన దీన్ని లక్ష్మణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి గుర్తుకుచేసుకుందాం.

పాంటింగ్‌ మానసికంగా దెబ్బకొట్టి..

అడిలైడ్‌ టెస్టులో రికీ పాంటింగ్‌ సారథ్యంలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి 556 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దాంతో భారత్‌ను ముందే మానసికంగా బెదరగొట్టింది. పాంటింగ్‌ (242; 352 బంతుల్లో 31x4) ఓర్పుతో బ్యాటింగ్‌ చేసి ద్విశతకం సాధించాడు. ఓపెనర్‌ లాంగర్‌ (58; 72 బంతుల్లో 7x4, 2x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సైమన్‌ కటిచ్‌ (75; 109 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలోనే చివర్లో జేసన్‌ గిలెస్పీ (48; 53 బంతుల్లో 6x4) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 550 దాటించాడు. టీమ్‌ఇండియా స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఐదు వికెట్లు తీయగా ఆశిష్‌ నెహ్రా, అజిత్‌ అగార్కర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ ఒక వికెట్‌ తీశాడు.

అదరని బెదరని ఈడెన్‌ హీరోలు..

ఆపై టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కినా ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. 66 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన గంగూలీ సేన 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆకాశ్‌ చోప్రా (27), వీరేంద్ర సెహ్వాగ్‌ (47), సచిన్‌ (1), గంగూలీ (2) విఫలమయ్యారు. ఇక మిగిలింది ద్రవిడ్‌, లక్ష్మణ్‌‌, పార్థివ్‌ పటేల్‌ మాత్రమే. ఒకవైపు కొండంత లక్ష్యం.. మరోవైపు భీకరమైన బౌలర్లు. అయినా పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు ఈడెన్‌ గార్డెన్స్‌ హీరోలు. లక్ష్మణ్‌ (148; 282 బంతుల్లో 18x4) సెంచరీతో మెరవగా ద్రవిడ్‌ (233; 446 బంతుల్లో 23x4, 1x6) ద్విశతకంతో ఆదుకున్నాడు. వీరిద్దరూ కంగారూ బౌలర్లకు మరోసారి పరీక్ష పెట్టారు. చూడచక్కని షాట్లతో ఏ బౌలర్‌నూ వదలలేదు. గిలెస్పీ, ఆండీ బిచెల్‌, స్టువర్ట్‌ మాక్‌గిల్‌లను ఆటాడుకున్నారు. ఐదో వికెట్‌కు 303 పరుగులు జోడించి జట్టును పోటీలో నిలిపారు. ఇక 150కి చేరువైన వేళ లక్ష్మణ్‌ ఔటయ్యాక ద్రవిడ్‌ చివరి వరకు క్రీజులో నిలిచి స్కోరును 523 పరుగులకు తీసుకెళ్లాడు. దీంతో వీరిద్దరూ కంగారూల ఆధిక్యాన్ని 23 పరుగులకే పరిమితం చేశారు.

పాంటింగ్‌ తుస్‌‌.. ఆసీస్‌ మటాష్‌..

ఇక రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరమితం చేసింది. ఇక్కడ కీలకంగా ఆడింది అగార్కర్‌. 6/41 ప్రదర్శనతో నిప్పులు చెరిగే బంతులేశాడు. చివరికి ఆస్ట్రేలియా 196 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు జస్టిన్‌ లాంగర్‌ (10), మాథ్యూ హెడెన్‌ (17)తో పాటు కెప్టెన్‌ పాంటింగ్‌ డకౌట్‌గా వెనుతిరిగి పూర్తిగా విఫలమయ్యారు. ఆపై మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మార్టిన్‌ (38), స్టీవ్‌వా (42), సైమన్‌ కటిచ్‌ (31), ఆడం గిల్‌క్రిస్ట్‌ (43) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 23 పరుగులు కలుపుకొని ఆస్ట్రేలియా 232 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియాకు నిర్దేశించింది.

బంతితో తిరుగుబాటు.. టీమ్‌ఇండియా తడబాటు..

మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు చివరిరోజు పెద్ద పరీక్షే ఎదురైంది. అప్పటికే నాలుగు రోజులు గడవడంతో పిచ్‌ మందకొడిగా మారింది. మోస్తరు లక్ష్యమే అయినా అప్పటికే బంతి అనూహ్యంగా తిరగడం మొదలైంది. దీంతో భారత్‌ ఎలా గెలుస్తుందనే ఆందోళన నెలకొంది. అయినా టీమ్‌ఇండియా ఆటగాళ్లు బెదరకుండా పోరాటం చేశారు. చోప్రా (20), సెహ్వాగ్‌ (47) శుభారంభం చేయగా తర్వాత ద్రవిడ్‌ (72 నాటౌట్‌; 170 బంతుల్లో 7x4) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సచిన్‌ (37; 59 బంతుల్లో 5x4)తో కలిసి నిలకడగా ఆడి కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. అయితే, ఊహించని పరిస్థితుల్లో సచిన్‌, గంగూలీ (12) విఫలమవడంతో టీమ్‌ఇండియా మళ్లీ ఒత్తిడిలోకి పడిపోయింది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌ (32; 34 బంతుల్లో 6x4) క్రీజులోకి వచ్చి ద్రవిడ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఈడెన్‌లో గెలిపించినట్లే అడిలైడ్‌లోనూ కంగారూలకు పీడకల మిగిల్చారు. కష్టమైన ఆసీస్‌ గడ్డపై క్లిష్ట పరిస్థితుల్లో మరో అద్భుత విజయం అందించారు. ఇలాంటి గొప్ప మధురానుభూతి మిగిల్చిన లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు..!

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని