Rishabh Pant: రిషభ్‌ పంత్‌ కారు ప్రమాదం.. సుశీల్‌ జీ.. మీరు రియల్‌ హీరో: వీవీఎస్‌ లక్ష్మణ్‌

రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్‌ఇండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ని కాపాడిన బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌ మాన్‌ని భారత మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ రియల్‌ హీరో అని ప్రశంసించాడు.  

Updated : 31 Dec 2022 17:51 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన పంత్‌ని అటుగా వస్తున్న బస్సు డ్రైవర్‌ కాపాడాడు. హరిద్వార్‌ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌ మాన్‌ ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి చాకచాక్యంగా వ్యవహరించాడు. వెంటనే బస్సును ఆపేసి మంటల్లో చిక్కుకున్న కారులోంచి పంత్‌ని బయటికి తీసుకొచ్చాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి పంత్‌కి వైద్యం సాయం అందడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఆ బస్సు డ్రైవర్‌ను పంత్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. టీమ్ఇండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ కూడా సుశీల్‌ మాన్‌ చూపిన ధైర్యసాహసాలను ప్రశంసించాడు. డ్రైవర్‌ సుశీల్‌తో అక్కడి ఉండి సహాయం అందించిన బస్సు కండక్టర్‌ పరమ్‌జిత్‌కు కూడా లక్ష్మణ్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

‘మంటల్లో చిక్కుకున్న కారులో నుంచి పంత్‌ని బయటికి తీసుకొచ్చి బెడ్‌షీట్‌తో చుట్టి అంబులెన్స్‌కి ఫోన్ చేసిన హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్ సుశీల్ కుమార్‌కు కృతజ్ఞతలు. మీ నిస్వార్థ సేవకు మేము మీకు ఎంతో రుణపడి ఉంటాము. సుశీల్ జీ రియల్‌ హీరో’అని లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు.  ‘రిషభ్‌కు డ్రైవర్ సుశీల్‌తోపాటు సహాయం చేసిన బస్ కండక్టర్ పరమ్‌జిత్‌ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. గొప్ప మనస్సుతో పంత్‌ని కాపాడిన  వారందరికీ కృతజ్ఞతలు’ అని మరో ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి. పంత్‌ ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించిన బస్సు డ్రైవర్‌ సుశీల్‌ కుమార్‌ మాన్‌ను హరియాణా రోడ్‌వేస్‌ పానిపత్‌ డిపో కార్యాలయంలో ప్రశంసా పత్రం,  షీల్డ్‌ బహుకరించి సన్మానించినట్లు డిపో మేనేజర్‌ కుల్దీప్ జాంగ్రా పీటీఐకి తెలిపారు. ప్రస్తుతం పంత్‌ దెహ్రాదూన్‌లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముఖం మీద అయిన గాయాలకు చిన్నపాటి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు