Team India: ద్రవిడ్‌ తర్వాత.. ప్రధాన కోచ్‌ పదవి ‘వెరీ వెరీ స్పెషల్‌’కేనా..!

దాదాపు 12 ఏళ్ల నుంచి టీమ్‌ఇండియా (Team India)కు ఐసీసీ ట్రోఫీని గెలవడం తీరని కలగా మిగిలిపోయింది. ధోనీ నాయకత్వంలో 2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. అప్పుడు ప్రధాన కోచ్‌గా కిరిస్టెన్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత కోచ్‌లు, కెప్టెన్లు మారినా కప్‌ మాత్రం దక్కలేదు.

Updated : 02 Jan 2023 21:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌ 2021 టోర్నీ తర్వాత రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ వచ్చాడు. అయితే ఇప్పటి వరకు రాహుల్‌ మార్గదర్శకత్వంలో ద్వైపాక్షిక సిరీసుల్లో మినహా మెగా టోర్నీల్లో భారత్‌ విఫలమైంది. ఇక ఈ ఏడాదిలో మరోసారి ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లు ఉన్నాయి. అప్పటి వరకు రాహుల్‌ ద్రవిడ్‌ పదవిలో ఉంటాడు. ఒకవేళ ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రాణిస్తే మాత్రం పొడిగింపు అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం అతడి స్థానంలో మరొకరిని బీసీసీఐ నియమించడం ఖాయం. 

అయితే ఇప్పటి వరకు క్రికెట్‌ వర్గాల ప్రకారం.. ద్రవిడ్‌ కొనసాగకపోతే మాత్రం మరో క్రికెట్ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్ (VVS Laxman) ప్రధాన కోచ్‌గా వచ్చే అవకాశం ఉంది. జనవరి 1న బీసీసీఐ సమీక్షలోనూ ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ‘వెరీ వెరీ స్పెషల్‌’ అని పిలుచుకొనే వీవీఎస్‌ లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఛైర్మన్‌గా ఉన్నాడు. ఇప్పటికే ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ భారత్‌ - ఏతోపాటు సీనియర్‌ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే అండర్ - 19 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు. 

టీ20లకు స్పెషలిస్ట్‌ కోచ్...?

ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యను సారథిగా బీసీసీఐ నియమించింది. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టును సన్నద్ధత చేయడంలో కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. అలాగే ఇదే ఏడాది ఆసియా కప్‌, టెస్టు ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ క్రమంలో టెస్టులు, వన్డేలకు ద్రవిడ్‌ను కొనసాగిస్తూ.. టీ20లకు ప్రత్యేకంగా మరొక కోచ్ నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపైనా బీసీసీఐ వర్గాలు విభిన్నంగా స్పందించాయి. ఇంతవరకు భారత క్రికెట్‌లో ఎప్పుడూ జరగలేదని, అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పేర్కొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు