Hardik pandya: అందుకే పాండ్యా ఆటగాళ్ల ఫేవరెట్‌ కెప్టెన్‌ అవుతాడు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

టీ20 సిరీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న హార్దిక్‌ పాండ్యాపై వీవీఎస్ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Updated : 17 Nov 2022 16:11 IST

దిల్లీ: రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ టీమ్‌ఇండియాకు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్‌ తమ జట్టు సన్నద్ధతను వివరించాడు. ఈ సందర్భంగా టీ20 సిరీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్న హార్దిక్‌ పాండ్యాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘హార్దిక్‌ పాండ్యా గొప్ప నాయకుడు. భారత టీ20 లీగ్‌లో గుజరాత్‌ను నడిపించిన సమయంలోనే అతడేంటో చూశాం. ఫ్రాంఛైజీ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జట్టుకు నాయకత్వం వహించి గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. ఐర్లాండ్‌ సిరీస్‌ సమయంలో నేను అతడితో చాలా సమయం గడిపాను. వ్యూహాలకు పదును పెడుతూనే మైదానంలో ప్రశాంతంగా ఉండగలడు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు వారికి ఇలాంటి ఒక కెప్టెన్‌ అవసరం. డ్రెస్సింగ్‌ రూంలో అతడు ఉండే తీరు.. ఆటలో పాటించే విలువలు ఎంతో గొప్పగా ఉంటాయి. అతడు పూర్తిగా ఆటగాళ్లకు ఇష్టమైన కెప్టెన్‌గా మారతాడు. అందరితోనూ సన్నిహితంగా ఉంటూ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకునేంత స్వేచ్ఛనివ్వగలడు. పాండ్యాలో నాకు నచ్చేది అదే. మైదానంలోనే కాదు బయట కూడా అసలైన నాయకుడికి చిరునామాగా నిలుస్తాడు’’ అని వెల్లడించాడు. 

పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం సరైన నిర్ణయమేనని టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కూడా తెలిపాడు. ‘‘ఒక ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ రాణించడం చాలా కష్టమైన పని.  ఒకవేళ రోహిత్‌ శర్మ వన్డేలు, టెస్టు సిరీస్‌ బాధ్యతలు చూసుకుంటే.. టీ20లకు కొత్త కెప్టెన్‌గా పాండ్యా ఉండటం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు’’ అంటూ స్పందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని