Avani Lekhara: అవనిలో స్ఫూర్తినింపిన అభినవ్‌ బింద్రా ఆటో బయోగ్రాఫీ

పుస్తకాలు మనిషికి ఆహ్లాదాన్ని పంచడమే కాదు స్ఫూర్తిని కూడా రగిలిస్తాయి. దాంతో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేలా ప్రభావితం చేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది పారా షూటర్‌ అవనీ లేఖరా విషయంలో. 19 ఏళ్లకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన అవని.. నేడు కాంస్యం సాధించాక మీడియాతో వర్చువల్‌గా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2008 ఒలింపిక్స్‌ పసిడి పతక ఛాంపియన్‌ అభినవ్‌ బింద్రా ఆటోబయోగ్రాఫీ..

Published : 04 Sep 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుస్తకాలు మనిషికి ఆహ్లాదాన్ని పంచడమే కాదు స్ఫూర్తిని కూడా రగిలిస్తాయి. దాంతో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించేలా ప్రభావితం చేస్తాయి. పారా షూటర్‌ అవనీ లేఖరా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 19 ఏళ్లకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన అవని.. నేడు కాంస్యం సాధించాక మీడియాతో వర్చువల్‌గా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2008 ఒలింపిక్స్‌ పసిడి పతక ఛాంపియన్‌ అభినవ్‌ బింద్రా ఆటోబయోగ్రఫీ.. ‘ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ.. మై ఒబెసివ్‌ జర్నీ టూ ఒలింపిక్ గోల్డ్‌’ అనే పుస్తకం తనని చాలా ప్రభావితం చేసిందని చెప్పింది. అది చదివాక.. అభినవ్‌ ఎంచుకున్న షూటింగ్‌ క్రీడలో వందశాతం న్యాయం చేశాడనిపించిందని తెలిపింది. ఈ పారాలింపిక్స్‌లో తాను స్వర్ణం సాధించానని తెలియగానే మొదట అభినవ్‌ బింద్రానే అభినందనలు చెప్పాడని వివరించింది.

ఏదైనా సాధించాలనే కసి, మనలో ఉండే కోరిక.. ఒక మనిషి విజయం సాధించడానికి దోహదపడతాయని అభినవ్‌ తన ఆటోబయోగ్రఫీలో రాశారని అవని పేర్కొంది. కోచ్‌ల సహకారం, మెరుగైన శిక్షణ‌, కష్టపడేతత్వం అన్నీ ఉంటే విజయానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. అభినవ్‌ తన కెరీర్‌లో ప్రొఫెషనల్‌ షూటర్‌గా ఎదిగేందుకు సహకరించిన కోచ్‌ల వివరాలతో పాటు.. ఒలింపిక్స్‌లో పాల్గొనేటప్పుడు ఎదురైన వివిధ అనుభవాలను వివరంగా రాసుకొచ్చినట్లు చెప్పింది. క్రీడల్లో ముఖ్యంగా ఏ క్రికెటరో లేదా గోల్ఫ్‌ ఆడే వ్యక్తి ఏదైనా టోర్నీలో విఫలమైతే.. తామేంటో నిరూపించుకోవడానికి మహా అయితే ఓ సంవత్సరం పడుతుందని, అదే ఒక ఒలింపియన్‌ ఒకసారి ఓడిపోతే మరో నాలుగేళ్లు వేచిచూడాలని అందులో రాసుందని, అవే తనకు ప్రేరణ కలిగించాయని డబుల్‌ పతక విజేత చెప్పుకొచ్చింది. కాగా,  అవని ఈ పారాలింపిక్స్‌లో ఇప్పటికే 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో  కాంస్యం సాధించగా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె మూడో పతకంపై కన్నేసింది. ఆదివారం జరగబోయే మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో పాల్గొననుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని