IND vs AUS: విరాట్‌ కోహ్లీ ఔటా..కాదా.. గావస్కర్‌ ఏమన్నాడంటే..?

దిల్లీ వేదికగా ఆసీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టు(IND vs AUS) తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ(virat kohli) ఔట్‌ వివాదాస్పదమైంది. దీనిపై పలువురు మాజీలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

Updated : 19 Feb 2023 11:32 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌:  బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)  రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ(virat kohli) ఔట్‌ అయిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆసీస్ కొత్త బౌలర్‌ కుహ్నెమన్ వేసిన బంతిని ఆడే క్రమంలో విరాట్‌ను ఎల్బీగా ఫీల్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. బంతి బ్యాట్‌ను తాకిందని భావించిన  కోహ్లీ డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. అయితే బంతి ఒకేసారి బ్యాట్‌, ప్యాడ్‌కు తాకినట్లు రీప్లేలో కనిపించినా మూడో అంపైర్‌ ఔటివ్వడం వివాదాస్పదమైంది. బంతి ముందు ప్యాడ్‌కే తాకినట్లు స్పష్టత లేకపోయినా.. మూడో అంపైర్‌ కోహ్లి ఔటని ప్రకటించాడు. అదే సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గావస్కర్‌(Sunil Gavaskar), ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మార్క్‌ వా(Mark Waugh) ఈ వివాదాస్పద ఔట్‌పై స్పందించారు. అంపైర్‌ నిర్ణయంతో వారు ఏకీభవించడం గమనార్హం.

‘సాఫ్ట్‌ సిగ్నల్‌ ఔట్‌ ఇచ్చినందున.. థర్డ్‌ అంపైర్‌ కచ్చితంగా చెక్‌ చేసుకోవాలి. స్టంప్స్‌ను బాల్‌ తాకుతుందా.. లేదా అనేది ఇక్కడ సమస్య కాదు. కోహ్లీ బ్యాట్‌కు అది తాకిందా లేదా అనేదే ముఖ్యం. అయితే అది అస్పష్టంగా ఉంది. ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. కోహ్లీ బ్యాట్‌కే అది మొదట తాకిందని థర్డ్‌ అంపైర్‌ కచ్చితంగా నిర్ధారించుకోవాలి’ అని గావస్కర్‌ అన్నాడు.

మార్క్‌ వా మాట్లాడుతూ.. అంపైర్‌ ఎంతో ధైర్యంగా తీసుకున్న నిర్ణయమని కొనియాడాడు. ఇలాంటి విషయాల్లో 10లో 9 సార్లు నాటౌట్‌గానే ప్రకటిస్తారని.. ఎంతో మంది అంపైర్లు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాటర్లకు అనుకూలంగా నిర్ణయం ఇస్తారని చెప్పాడు. అయితే ఇక్కడ చాలా అస్పష్టత ఉండటంతో అంపైర్‌ ఆ నిర్ణయం తీసుకున్నాడని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని