Team India: టీమ్‌ఇండియాకు మరో షాక్‌ 

ఇంగ్లాండ్‌లో బయోబుడగలో ఉన్న టీమ్‌ఇండియాకు మరో షాక్‌ తగిలింది. యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వేలికి గాయమైంది. దాంతో ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌ జట్టుతో ప్రారంభమయ్యే ఐదు...

Updated : 23 Jul 2021 16:03 IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్‌

లండన్‌: ఇంగ్లాండ్‌లో బయోబుడగలో ఉన్న టీమ్‌ఇండియాకు మరో షాక్‌ తగిలింది. యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వేలికి గాయమైంది. దాంతో ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌ జట్టుతో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. మరోవైపు 2018లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా వాషింగ్టన్‌ గాయపడి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఇంటిముఖం పట్టాడు. అతడికిలా జరగడం ఇది రెండోసారి. ఇక తాజా పర్యటనలో టీమ్‌ఇండియా ఇప్పటికే గాయాల కారణంగా శుభ్‌మన్‌గిల్‌, అవేశ్‌ ఖాన్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాషింగ్టన్‌ కూడా గాయపడటంతో భారత జట్టుకు మరో తలనొప్పి ఎదురైంది.

డర్హమ్‌ వేదికగా కోహ్లీసేన.. కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ జట్టుతో మూడురోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌ సుందర్‌ కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ తరఫున బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ వేసిన ఓ బంతి అతడి చేతి వేలికి తగిలి గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. కనీసం అతడికి ఐదువారాల విశ్రాంతి అవసరమున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండడని అర్థమవుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె పాల్గొనలేదు. కానీ, వారిద్దరూ నెట్స్‌లో సాధన చేసి కనిపించారు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ చేపట్టగా ఆట డ్రాగా ముగిసింది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా కౌంటీ జట్టు 220కే ఆలౌటైంది. ఇక భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192/3 పరుగుల వద్ద డిక్లేర్‌ చేయగా, నిర్ణీత సమయానికి కౌంటీ సెలక్ట్ ఎలెవన్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని