‘301’ క్యాప్‌.. వెలకట్టలేని సంపద

టీమ్‌ఇండియా టెస్టు క్యాప్‌ ధరించడమంటే వెలకట్టలేని సంపద అని వాషింగ్టన్‌ సుందర్‌ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన అనంతరం శుక్రవారం ఇంటికి చేరుకున్న అతడు...

Updated : 24 Jan 2021 10:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు క్యాప్‌ ధరించడమంటే వెలకట్టలేని సంపద అని వాషింగ్టన్‌ సుందర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ  పర్యటన అనంతరం శుక్రవారం ఇంటికి చేరుకున్న అతడు తాజాగా తన తండ్రి సుందర్‌తో కలిసి ఓ ఫొటో దిగాడు. అందులో సుందర్‌ తన కుమారుడి అరంగేట్రం టెస్టు క్యాప్ ‘301’ను చూస్తూ ఆనందించారు. అది వెలకట్టలేని సంపదని వాషింగ్టన్‌ ట్వీట్‌ చేశాడు. 

కాగా, వాషింగ్టన్‌ తండ్రి సుందర్‌ ఒకప్పుడు రంజీ ప్లేయర్‌. వాషింగ్టన్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ఆయనకు చిన్నతనంలో క్రికెట్‌ ఆడడానికి ఆర్థికంగా సహాయం చేశారు. ఆ మాజీ అధికారిపై ప్రేమతో తన కుమారుడికి వాషింగ్టన్‌ అనే పేరుపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎల్‌లో రాణించిన ఈ యువ ఆల్‌రౌండర్‌ తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే, సీనియర్‌ ఆటగాళ్లంతా గాయాల బారిన పడడంతో  ‘గబ్బా టెస్టు’లో అనూహ్యంగా అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకొని అందరిచేతా ప్రశంసలు పొందాడు. 

గబ్బా టెస్టులో వాషింగ్టన్‌ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసి బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 62, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె చేతుల మీదుగా ఆ టెస్టు ఆరంభంలో వాషింగ్టన్‌ ‘టీమ్‌ఇండియా 301’వ టెస్టు క్రికెటర్‌గా‌ టోపీ అందుకున్నాడు. దాన్నే తన తండ్రికి చూపిస్తూ వాషింగ్టన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇదే సిరీస్‌లో టీమ్‌ఇండియా వాషింగ్టన్‌తో కలిపి ఆరుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అందులో నటరాజన్‌, నవ్‌దీప్‌సైని, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్, శార్దూల్‌ ఠాకుర్‌ (గతంలో ఒక టెస్టు ఆడి మధ్యలోనే గాయపడ్డాడు) ఉన్నారు.

ఇవీ చదవండి..
ఆ ఆరుగురికిఎస్‌యూవీ కార్లు
ద్రవిడ్‌ సలహా పాటిస్తే మేలు : పీటర్సన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని