టెయిలెండర్లు నిలవలేకపోవడం బాధ కలిగించింది 

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టెయిలెండర్లు కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం నిరాశకు గురిచేసిందని వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం సుందర్‌ విచారం వ్యక్తం చేశారు...

Updated : 07 Mar 2021 12:30 IST

వాషింగ్టన్‌ సుందర్‌ శతకం కోల్పోవడంపై తండ్రి విచారం..

(Photo: BCCI)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టెయిలెండర్లు కొద్దిసేపు క్రీజులో నిలవలేకపోవడం నిరాశకు గురిచేసిందని వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం సుందర్‌ విచారం వ్యక్తం చేశారు. మొతేరా వేదికగా జరిగిన చివరి టెస్టులో టీమ్‌ఇండియా శనివారం ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అంతకుముందు 294/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా చివరికి 365 పరుగులకు ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌(43; 97 బంతుల్లో 5x4, 1x6), వాషింగ్టన్‌ సుందర్‌(96*; 174 బంతుల్లో 10x4, 1x6) రాణించి ఏడో వికెట్‌కు శతకం భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే సుందర్‌ తొలి టెస్టు సెంచరీకి చేరువైన వేళ అక్షర్‌ పటేల్‌ రనౌటయ్యాడు. ఆపై ఇషాంత్‌(0), మహ్మద్‌ సిరాజ్‌(0) సైతం వెనువెంటనే ఔటవ్వడంతో సుందర్‌ తొలి అంతర్జాతీయ శతకానికి చేరువలో నాటౌట్‌గా నిలిచిపోయాడు.

ఇదే విషయంపై ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వాషింగ్టన్‌ తండ్రి.. తన కుమారుడు సెంచరీకి చేరువలో ఉండగా, టెయిలెండర్లు వికెట్లు కాపాడుకోలేకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. ‘టెయిలెండర్ల పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. కొద్దిసేపు కూడా వాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. ఒకవేళ టీమ్‌ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ ఇలా వికెట్లు కోల్పోతే ఎలా ఉంటుంది? అది భారీ తప్పిదం కాదా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌ను ఎంతో మంది యువ క్రికెటర్లు వీక్షిస్తారని.. ఈ టెయిలెండర్ల ఆట చూసి వాళ్లు అలా నేర్చుకోవద్దని సుందర్‌ తండ్రి చెప్పుకొచ్చారు. ఆ స్థితిలో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు టెక్నిక్‌, నైపుణ్యాలు అవసరం లేదని, అక్కడ ధైర్యంగా నిలబడటం ఒక్కటే కావాలని అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఇదే సిరీస్‌లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ వాషింగ్టన్‌ 85* పరుగులతో నిలిచి శతకాన్ని చేరుకోలేకపోయాడు. అప్పుడు కూడా టెయిలెండర్లు త్వరగా ఔటవ్వడంతో ఈ యువ ఆల్‌రౌండర్‌ తొలిసారి ఆ అవకాశాన్ని కోల్పోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు