తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్‌ చేసిన సుందర్‌

టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి అని అతడి తండ్రి ఎం.సుందర్‌ అన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్‌ ఆడాడని తెలిపారు. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్‌గా భావిస్తారని నిజానికి అతడు...

Published : 18 Jan 2021 16:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి అని అతడి తండ్రి ఎం.సుందర్‌ తెలిపారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్‌ ఆడాడని వెల్లడించారు. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్‌గా భావిస్తారని నిజానికి అతడు 70% బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్ ‌ముందు వాషింగ్టన్‌ తనతో మాట్లాడాడని వెల్లడించారు.

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన సుందర్‌ బ్యాటు, బంతితో అదరగొడుతున్నాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లు విసిరి 89 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 18 ఓవర్లు విసిరి 80 పరుగులిచ్చి 1 వికెట్‌ తీశాడు. ఇక టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి 144 బంతుల్లో 62 పరుగులు చేశాడు. 7 బౌండరీలు, 1 సిక్సర్‌ బాదేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (67; 115 బంతుల్లో 9×4, 2×6)తో కలిసి ఏడో వికెట్‌కు 123 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. ఈ ఆనందాన్ని సుందర్‌ తండ్రి మీడియాతో పంచుకొన్నారు. బాల్యం నుంచే అతడిలో పోరాటతత్వం ఉండేదని వివరించారు.

‘వాషింగ్టన్‌కు తొమ్మిదేళ్లు ఉంటాయి. అండర్‌-14 అంతర్‌ పాఠశాలల మ్యాచుకు కొన్ని రోజుల ముందే సాధన చేస్తుండగా అతడి తలకు గాయమైంది. ఐదు కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి 39 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచును గెలిపించాడు.  అతడు సవాళ్లకు భయపడడని ఆ రోజే నాకు అర్థమైంది. ఐపీఎల్‌, టీ20ల్లో వాషింగ్టన్‌ను చూసినవాళ్లంతా అతడిని ఆఫ్‌స్పిన్నర్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. బ్యాటింగ్‌ పరంగా అతడు అత్యంత ప్రతిభావంతుడని నా విశ్వాసం. నిజానికి అతడు 70% బ్యాట్స్‌మన్’ అని సుందర్‌ అన్నారు.

శనివారం మ్యాచులో మూడు వికెట్లు తీసిన తర్వాత వాషింగ్టన్‌ తనకు వాట్సప్‌ కాల్‌ చేశాడని సుందర్‌ చెప్పారు. ‘క్లుప్తంగా మా సంభాషణ సారాంశం ఇది. ఈ మ్యాచులో నువ్వు చేయాల్సిన పనింకా పూర్తవ్వలేదు. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్‌ చేయాలి. ఇదో అరుదైన అవకాశం. దీనిని కచ్చితంగా అందిపుచ్చుకోవాలని చెప్పాను’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం నాలుగో టెస్టు ఐదో రోజుకు చేరుకుంది. ఆఖరి రోజు టీమ్‌ఇండియా 324 పరుగులు చేస్తే విజయం అందుకుంటుంది. అయితే వర్షం ముప్పు పొంచిఉంది.

ఇవీ చదవండి
ప్చ్‌.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్‌!
చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్‌

 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని