IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్

భారత్‌ (Team India), పాకిస్థాన్‌ (Pakistan) జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఆసియా కప్‌ (Asia Cup 2023) ఇప్పుడు పాక్‌ వేదికగా జరగబోతోంది.. దీంతో ఇరు బోర్డుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

Published : 29 Jan 2023 01:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ ఆతిథ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం.. పాకిస్థాన్‌ వేదికగా ఆసియా కప్ - 2023 జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో జరిగితే తాము అక్కడికి వెళ్లేది లేదని బీసీసీఐ కార్యదర్శి జైషా  వ్యాఖ్యానించడంతో వేడి రాజుకొంది. అప్పటి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)  ఛైర్మన్‌ రమీజ్ రజా కూడా ప్రతిస్పందించాడు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు పీసీబీకి కొత్త ఛైర్మన్‌ వచ్చారు. రమీజ్‌ రజాకు బదులు నజామ్‌ సేథీ పీసీబీ ఛైర్మన్‌ హోదాలో ఆసియా కప్‌  కౌన్సిల్‌ (ACC) తో ఫిబ్రవరి 4వ తేదీన భేటీ కాబోతున్నారు. అలాగే బీసీసీఐ కార్యదర్శి జైషానూ కలుస్తానని సేథీ వెల్లడించారు. ఈ క్రమంలో నజామ్‌ ప్రయత్నాలను వసీమ్‌ అక్రమ్‌ అభినందించాడు. 

‘‘నజామ్‌ సేథీ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇదంతా రెండు ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంది. బోర్డుల మధ్య సరైన పద్ధతిలో చర్చలు జరగాలి. ‘మీరు ఇక్కడికి రాకపోతే.. మేం అక్కడికి వచ్చేది లేదు’ అని చెప్పడానికి ఇదేమీ గల్లీ క్రికెట్‌ కాదు. పాక్‌కు వచ్చి క్రికెట్‌ నడుపుతున్న ఈ కిడ్స్‌ ఎవరో నాకు అర్థం కావడం లేదు’’

పీసీబీ ఛైర్మన్‌గా పని చేసిన రమీజ్‌ రజాపైనా వసీం అక్రమ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేవలం ఆరు రోజుల కోసమే పీసీబీ ఛైర్మన్‌గా వచ్చాడు. ఇప్పుడు తన పాత స్థానానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు నజామ్ సేథీ వచ్చారు. అతడు చాలా అనుభవజ్ఞుడు. పీసీబీ ఛైర్మన్‌గా క్రికెటర్లు ఉండటం సరైంది కాదనేది నేను భావిస్తున్నా. ఇది పరిపాలన బాధ్యతలు. అన్ని బోర్డులతో సరైన సంబంధాలను కలిగి ఉండాలి. దీని కోసం నజామ్‌ సేథీ సరైన వ్యక్తి. ఇప్పుడు ఈ మాటలకు కొందరికి కోపం వచ్చినా సరే.. నాకేం అభ్యంతరం లేదు’’ అని వసీమ్ అక్రమ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని