Virat Kohli: ఛేజింగ్‌ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్‌ సీక్రెట్‌ వెల్లడించిన అక్రమ్‌

విరాట్‌ కోహ్లీ ఛేజింగ్‌ల్లో అనుసరించే వ్యూహాన్ని ఇటీవల పాక్‌ మాజీ పేసర్‌ వసీం అక్రమ్‌ వెల్లడించాడు. 

Published : 17 Jun 2024 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సమకాలీన క్రికెట్‌లో ఛేజ్‌ మాస్టర్‌ అంటే విరాట్‌ కోహ్లీనే. కొండంత లక్ష్యాలను కూడా నిలకడగా.. నిబ్బరంగా ఆడుతూ పిండి చేయగలడు. కింగ్‌ క్రీజులో ఉన్నంతవరకు ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోదంటే అతిశయోక్తి కాదేమో. కోహ్లీ బ్యాటింగ్‌ ప్లాన్ల గురించి తాజాగా పాక్‌ లెజెండ్‌ వసీం అక్రమ్‌ (Wasim Akram) ఓ మ్యాచ్‌ కామెంటరీలో స్పందించాడు. ఇటీవల ఆయన, సిద్ధూ, విరాట్‌ (Virat Kohli) కలిసి ఓ విమానంలో ప్రయాణించినట్లు వెల్లడించాడు. ‘ఆ సమయంలో కోహ్లీ ఎలాంటి వ్యూహాలు పాటిస్తాడో వెల్లడించమని సిద్ధూ కోరాడు. దీనికి కోహ్లీ స్పందిస్తూ ‘వికెట్‌కు తగినట్లు బ్యాటింగ్‌ చేస్తాను. ఫ్లాట్‌ వికెట్లపై దూకుడుగా షాట్లు ఆడి బంతిని బౌండరీలు దాటిస్తాను. అదే కఠినమైన వికెట్‌ అయితే.. స్ట్రయిక్‌ రేటును మెరుగ్గా ఉంచేందుకు రెండు పరుగులు చొప్పున చేస్తాను. మైదానంలోకి రాకుండా ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోను. ఒక్కసారి క్రీజులోకి అడుగుపెట్టాక అప్పుడు పరిస్థితిని బట్టి ఏం చేయాలో నిర్ణయించుకొంటా’ అన్నాడు’’ అని అక్రమ్‌ గుర్తుకుతెచ్చుకొన్నాడు. పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా లైవ్‌ కామెంట్రీలోనే అతడు ఈ విషయాన్ని పేర్కొన్నాడు. 

అదే సమయంలో పక్కనే ఉన్న కామెంటేటర్‌ హర్షా భోగ్లే కూడా అక్రమ్‌ వ్యాఖ్యలతో ఏకీభవించాడు. ‘‘సాధారణంగా టీ20 ఫార్మాట్‌, వేడి-ఉక్కపోత వాతావరణం ఉన్నచోట్ల రెండు రన్స్‌ చేయడం గురించి తక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో రెండు రన్స్‌ చేయాలంటే కోహ్లీలా ఫిట్‌గా ఉండాల్సిందే’’ అని భోగ్లే పేర్కొన్నాడు.  

పొట్టి ప్రపంచకప్‌ టోర్నీల్లో కోహ్లీనే ఇప్పటివరకు అత్యధిక పరుగులు (1146) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడు 28 ఇన్నింగ్స్‌లు ఆడి 67 సగటు, 130 స్ట్రైక్‌రేటుతో ఈ ఘనత అందుకొన్నాడు. వీటిల్లో 14 అర్ధ శతకాలున్నాయి. 2014, 2016 ఎడిషన్లలో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. 2024 ప్రపంచకప్‌లో మాత్రం ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే సాధించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని