IND vs SL: జడేజా లేని లోటు ఎక్కడా కనిపించలేదు: వసీం జాఫర్

శ్రీలంకతో టీ20 సిరీస్‌లకు (IND vs SL) రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అందుబాటులో లేడు. అతడి స్థానంలో సుందర్‌ (sundar), అక్షర్ (Axar Patel) జట్టులో ఉన్నారు. వీరిద్దరూ ఆల్‌రౌండర్లు. వీరిద్దరిలో తొలి రెండు మ్యాచుల్లో అక్షర్‌ పటేల్‌ ఆడి మెప్పించాడు.

Published : 07 Jan 2023 10:26 IST

ఇంటర్నెట్ డెస్క్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకొంటున్న రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో సిరీస్‌లకు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ను టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. తొలి రెండు టీ20ల్లో వాషింగ్టన్‌ సుందర్‌ ఆడలేదు. అవకాశం వచ్చిన అక్షర్ పటేల్‌ మాత్రం అదరగొట్టేశాడు. ఇలాగే రాణిస్తే మాత్రం జట్టులో జడేజా లేని లోటును అక్షర్ తప్పకుండా తీరుస్తాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు.

‘‘భారత జట్టు రవీంద్ర జడేజాను మిస్‌ అయిందని నేను అనుకోవడం లేదు. అన్ని ఫార్మాట్లలో భారత్‌ తరఫున కీలక ఆటగాడిగా జడేజా మారాడు. అయితే ఇప్పుడు టీమ్‌ఇండియాకి అక్షర్ పటేల్‌ రూపంలో అద్భుతమైన క్రికెటర్‌ దొరికాడు. జడేజా జట్టుకు దూరమైనప్పటి నుంచి మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. నాణ్యమైన క్రికెటర్‌గా అక్షర్ పటేల్ ఎదుగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న నెంబర్‌వన్ 1 స్పిన్‌ ఆల్‌రౌండర్‌. అందుకే జడేజాకు ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా మారాడు. పవర్‌ప్లే ఓవర్లలోనూ అక్షర్ అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. అయితే జడేజా అలా వేయలేడు’’

‘‘తొలి మ్యాచ్‌లో రాణించిన అక్షర్.. రెండో టీ20లో అద్భుతంగా ఆడాడు. ఆటగాడిగా అత్యుత్తమంగా పరిణితి చెందాడు. టెక్నిక్‌పరంగానూ ఇంప్రూవ్‌ అయ్యాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అక్షర్ ఇదే విధంగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణిస్తే మాత్రం మరో చర్చకు దారి తీయడం ఖాయం’’ అని జాఫర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని