Wasim jaffer: బ్యాటర్లు బంతిపై సాధన మానేశారు.. అందుకే ఈ చిక్కులు: వసీం జాఫర్‌

కివీస్‌తో రెండో వన్డేలో సంజూ శాంసన్‌ లేకపోవడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు.

Published : 28 Nov 2022 01:42 IST

దిల్లీ: కివీస్‌తో రెండో వన్డేలో సంజూ శాంసన్‌ లేకపోవడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. కొంత కాలంగా సరైన కాంబినేషన్‌ను తయారు చేసుకోవడంలో భారత జట్టు విఫలమవుతోందని అన్నాడు. ఇందుకు గల కారణాలను అతడు విశ్లేషించాడు. ఆల్‌రౌండర్లను ఉపయోగించుకోవడంలో టీమ్ఇండియా కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నాడు. 

‘‘టీమ్ఇండియాలో తీవ్రమైన ఆల్‌రౌండర్ల కొరత ఉంది. జట్టులో వారి సంఖ్య చాలా తక్కువ. ఉన్నవారినే టాప్‌ స్థానంలో ఆడించేందుకు తొందరపడిపోతుంటారు. కానీ, కొన్ని పర్యటనల్లో పేలవమైన ప్రదర్శన చేసి కొందరు ఆటగాళ్లు నష్టపోతుంటారు. ఫలితంగా టీమ్‌ఇండియాలో ఎంత వేగంగా చేరతారో అంతే వేగంగా నిష్క్రమిస్తుంటారు. విజయ్‌ శంకర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, కృనాల్ పాండ్య ఇందుకు ఉదాహరణలు. అందుకే ఆటగాళ్లు నిలదొక్కుకునేంత వరకు మనం కాస్త ఓర్పుతో వేచిచూడాల్సి ఉంటుంది. జట్టులో బౌలింగ్‌, త్రోడౌన్‌ స్పెషలిస్టులు ఉండటం కూడా సమస్యగా మారింది. వీరు ఉన్నారన్న ధీమాతో బ్యాటర్లు నెట్‌లో బౌలింగ్‌పై సాధన తగ్గించేస్తున్నారు. ఇది పార్ట్‌టైమ్‌ బౌలర్ల కొరతను సృష్టిస్తోంది’’ అంటూ జాఫర్‌ వివరించాడు.  

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియాలో ఉన్న 5 మంది బౌలర్లు వెంటవెంటనే పరుగులు సమర్పించేయడం భారత జట్టును ఇరకాటంలో పడేసింది. ఫలితంగా ఆరో బౌలర్‌ అవసరం జట్టుకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా కోసం సంజూ శాంసన్‌ను టీమ్‌ఇండియా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని