Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20ల కంటే వన్డేలకే సరిపోతాడు: వసీం జాఫర్‌

టీమ్‌ఇండియా యువ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్ టీ20ల కంటే వన్డేలకే సరిపోతాడని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 26 Nov 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్ టీ20ల కంటే వన్డేలకే సరిపోతాడని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఉమ్రాన్‌ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తన మొదటి ఐదు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్‌ తర్వాతి ఐదు ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ గురించి వసీం జాఫర్ మాట్లాడాడు. అతడి బౌలింగ్‌లో పూర్తి స్థాయి వైవిధ్యాలు లేవని, అందువల్ల ఉమ్రాన్‌ టీ20 ఫార్మాట్‌లో ఎక్కువగా సక్సెస్‌ కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.  

‘టీ20ల నుంచి వన్డేల్లోకి, వన్డేల్లోంచి టెస్టుల్లోకి మారుతున్న కొద్దీ ఎక్కువ నైపుణ్యాలను కలిగి ఉండాలి. యువ బౌలర్లు వాటిని నేర్చుకుంటారు. ఉమ్రాన్‌ మాలిక్‌కు టీ20ల కంటే వన్డే ఫార్మాట్ సరిపోతుంది. ఈ ఫార్మాట్‌లో (టీ20ల్లో) సరైన లైన్‌, లెంగ్త్‌తో షార్ట్‌బాల్‌ని వేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అతడి బౌలింగ్‌లో ఎక్కువ వేరియేషన్స్‌ లేవు. ఈ విషయాన్ని భారత టీ20 లీగ్‌లో గమనించాం’ అని జాఫర్‌ అన్నాడు. కివీస్‌తో ఆదివారం జరిగే రెండో వన్డేలో యుజేంద్ర చాహల్‌ స్థానంలో మంచి ఫామ్‌లో ఉన్న కుల్‌దీప్‌ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని వసీం సూచించాడు. తొలి వన్డేలో యుజ్వేంద్ర చాహల్‌ పది ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా భారీగా పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని