Team India: అశ్విన్‌పై అంత నమ్మకమా? 

టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, రంజీ క్రికెట్‌ పరుగుల వీరుడు వసీమ్‌ జాఫర్‌ ఇటీవల ఏ సందర్భాన్నీ వదలడం లేదనే సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సందర్భోచితంగా ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా ఇట్టే ఆకట్టుకునే మీమ్స్‌తో ఛలోక్తులు విసురుతూ నెటిజెన్లను అలరిస్తున్నాడు.

Published : 29 May 2021 01:38 IST

ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌పై జాఫర్‌ ట్రోలింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, రంజీ క్రికెట్‌ పరుగుల వీరుడు వసీమ్‌ జాఫర్‌ ఇటీవల ఏ సందర్భాన్నీ వదలడం లేదనే సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సందర్భోచితంగా ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా ఇట్టే ఆకట్టుకునే మీమ్స్‌తో ఛలోక్తులు విసురుతూ నెటిజెన్లను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించిన విధి విధానాలను విడుదల చేయగా, జాఫర్‌ తనదైన శైలిలో స్పందించాడు.

ప్రముఖ బాలీవుడ్‌ సినిమా ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’లోని ఓ సన్నివేశంలో హీరో సంజయ్‌ దత్‌ తరగతి గది నుంచి బయటకు వెళుతూ తన రూమ్మేట్‌ను పాఠం అర్థం చేసుకోమని, తర్వాత దాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పమనే డైలాగ్‌ ఉంటుంది. అయితే, ఐసీసీ ట్వీట్‌కు ఆ సన్నివేశానికి తగ్గ మీమ్‌తో జాఫర్‌.. ‘టీమ్‌ఇండియా పరిస్థితి ఇది’ అని పేర్కొంటూ, రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఫస్ట్‌బెంచ్‌ స్టూడెంట్‌గా అభివర్ణిస్తూ.. ట్రోలింగ్‌ చేశాడు. అతడి ఉద్దేశం ఏమిటంటే.. ఐసీసీ విడుదల చేసిన ఛాంపియన్‌షిప్‌ విధివిధానాలను తొలుత అశ్విన్ అర్థం చేసుకోవాలని, ఆ తర్వాత వాటిని టీమ్‌ఇండియా ఆటగాళ్లకు వివరించాలనీ. ఎందుకంటే క్రికెట్‌లో ఏ విషయాన్నైనా అశ్విన్‌ చాలా త్వరగా అర్థం చేసుకుంటాడనే అభిప్రాయం ఉంది. దాంతో జాఫర్‌ ఇలాంటి పోస్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు.

కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 18 నుంచి సౌథాంప్టన్‌ వేదికగా ఆ మ్యాచ్‌ జరుగనుంది. అయితే, ఏదైనా అనుకోని కారణాల వల్ల ఆ ఐదు రోజుల్లో మ్యాచ్‌ సమయాన్ని కోల్పోతే రిజర్వ్‌డే కింద ఐసీసీ ఆరో రోజును కేటాయించింది. ఒకవేళ ఐదు రోజుల్లోనే ఫలితం తేలితే రిజర్వ్‌డేతో పనిలేదు. మ్యాచ్‌ డ్రాగా ముగిసినా, టై అయినా.. ఇరు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. మరోవైపు ఇంగ్లాండ్‌ పర్యటన కోసం టీమ్‌ఇండియా ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో అశ్విన్‌ కూడా ఉన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని