Jaffer-Vaughan: హలో వాన్‌.. నిన్ను చాలాకాలంగా చూడలేదు: జాఫర్

బంగ్లాదేశ్‌ చేతిలో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ కావడంతో ఇంగ్లాండ్‌పై విమర్శలు రేగాయి. అయితే, ఇంగ్లాండ్‌ ఓటమిపై ఆ దేశ మాజీ కెప్టెన్‌  మైకెల్‌వాన్‌ను టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీమ్‌ జాఫర్‌ గుర్తు చేసుకున్నాడు.

Published : 16 Mar 2023 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ (Wasim Jaffer), ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ (Michael Vaughan) వాన్‌ మధ్య ట్విటర్ వేదికగా సంవాదం జరుగుతూ ఉంటుంది. భారత ప్రదర్శనపై వ్యాఖ్యలు చేస్తూ మైకెల్‌ వాన్‌ నిరంతరం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తాడు. తాజాగా వాన్‌ను  ఆటపట్టిస్తూ వసీమ్ జాఫర్ చేసిన ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా అంతే ఉత్సాహంగా కామెంట్లు కురిపించారు. ఇంతకీ ఏంటనేది తెలియాలంటే ఇది చదవేయండి..

భారత్ - ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ జరుగుతున్నప్పుడే ఇంగ్లాండ్‌ - బంగ్లాదేశ్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరిగింది. ఆసీస్‌పై టీమ్‌ఇండియా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటువైపు బంగ్లా చేతిలో ఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌ అయిపోయింది. టీ20 ప్రపంచకప్‌ విజేత అయిన ఇంగ్లాండ్‌ 0-3 తేడాతో ఓడిపోవడంపై విమర్శలు రేగాయి. దీంతో మైకెల్‌ వాన్‌ను ఆటపట్టించేందుకు వసీమ్‌ జాఫర్ సరదాగా ట్వీట్‌ చేశాడు. ‘‘హలో మైకెల్‌ వాన్, చాలాకాలంగా చూడలేదు’’ అని కన్నుకొడుతున్న ఎమోజీతోపాటు బంగ్లా-ఇంగ్లాండ్‌ హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టాడు. బంగ్లాదేశ్‌ జెర్సీతో ఉండటం గమనార్హం. బంగ్లా అండర్‌ -19 బ్యాటింగ్‌ కోచ్‌గా గతంలో జాఫర్ బాధ్యతలు నిర్వర్తించాడు.

గతంలో వసీమ్‌ జాఫర్ పంజాబ్ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా నియామకమైన సమయంలో మైకెల్‌ వాన్‌ స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పుడప్పుడు వేసిన తన పార్ట్‌ టైమ్‌ బౌలింగ్‌లోనే జాఫర్ ఔట్ కావడంతో.. టెస్టుల్లో తన తొలి వికెట్‌ ఇప్పుడు బ్యాటింగ్‌ కోచ్‌గా రావడం గమనార్హం అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్‌ వార్‌ కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లాండ్‌ ఓడిపోవడంతో వసీమ్‌ జాఫర్‌ వాన్‌పై విమర్శనాస్త్రాలు సంధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని