IND vs WI: రవి అంత మంచి క్యాచ్‌ పట్టి.. చివరికి సిక్సర్‌ ఇచ్చావా!

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా అరంగేట్రం క్రికెటర్‌ రవి బిష్ణోయ్‌ (2/17) అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తొలి మ్యాచ్‌లోనే...

Published : 17 Feb 2022 14:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా అరంగేట్రం క్రికెటర్‌ రవి బిష్ణోయ్‌ (2/17) అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. అయితే, అంతకన్నా ముందు అతడు ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. కానీ, చివరికి అది సిక్సర్‌గా నమోదవ్వడం గమనార్హం. ఇది అటు టీమ్‌ఇండియాకు ఇటు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ బ్రెండన్‌ కింగ్‌(4)ను భువనేశ్వర్‌ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌ పంపాడు. అయితే, తర్వాత వచ్చిన నికోలస్‌ పూరన్‌ (61), మేయర్స్‌ (31)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అయితే, అంతకన్నా ముందే పూరన్‌ (8) పరుగుల వద్ద ఉండగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ తొలి బంతి ఫ్లైటెడ్‌ డెలివరీగా పడటంతో విండీస్‌ బ్యాటర్‌ లాంగాఫ్‌ దిశగా బంతిని దంచికొట్టాడు. అటువైపు ఫీల్డింగ్‌ చేస్తున్న రవిబిష్ణోయ్‌ ఆ బంతిని చూస్తూ వెనక్కి పరిగెడుతూ వెళ్లి రెండు చేతులతో క్యాచ్‌ ఒడిసిపట్టాడు. అదే సమయంలో అతడి కాలు బౌండరీ లైన్‌కు టచ్‌ కావడంతో అది సిక్సర్‌గా నమోదైంది. దీంతో పూరన్‌ బతికిపోవడమే కాకుండా విండీస్‌కు ఆరు పరుగులొచ్చాయి. తర్వాత రెచ్చిపోయిన పూరన్‌.. విండీస్‌ 157/7 స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బిష్ణోయ్‌ పట్టిన క్యాచ్‌ సిక్సర్‌గా మారడం చూసి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ సైతం నిరాశకు గురయ్యాడు. అంత మంచి క్యాచ్‌ పట్టి అది వృథా కావడమే కాకుండా ఆరు పరుగులిచ్చిన కారణంగా బిష్ణోయ్‌ కూడా బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియోను చూడండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని