Virat Kohli: డివిలియర్స్‌ను గుర్తు చేసుకుంటూ విరాట్‌ కోహ్లీ భావోద్వేగం.. ఏం చెప్పాడో చూడండి!

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ, ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 11 ఏళ్లుగా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన...

Published : 30 Mar 2022 01:42 IST

ఈసారి కప్పుగెలిస్తే.. ఏబీనే గుర్తుచేసుకుంటా: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ, ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మంచి స్నేహితులనే సంగతి అందరికీ తెలిసిందే. 11 ఏళ్లుగా ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఎప్పుడూ సోదరుల్లా కలిసి మెలిసి తిరుగుతారు. అయితే, డివిలియర్స్‌ గతేడాది నవంబర్‌లో ఆటకు పూర్తిగా వీడ్కోలు పలకడంతో ఈసారి మెగా టోర్నీలో ఆడలేకపోతున్నాడు. అతడు లేకపోవడం ఎలా అనిపిస్తోందని కోహ్లీని అడగ్గా భావోద్వేగం చెందాడు. ఈసారి బెంగళూరు కప్పు గెలిస్తే తాను ఏబీని గుర్తుచేసుకుంటానని చెప్పాడు.

‘డివిలియర్స్‌ లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అతడు ఆటకు వీడ్కోలు పలికిన రోజు నాకింకా గుర్తుంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత మేం దుబాయ్‌ నుంచి భారత్‌కు తిరిగి వచ్చేటప్పుడు నాకొక వాయిస్‌ నోట్‌ పెట్టాడు. అయితే, డివిలియర్స్‌ ఈ నిర్ణయం తీసుకుంటాడనే సందేహం నాకు గత సీజన్‌లోనే అనిపించింది. అప్పుడు నాతో మాట్లాడుతూ ‘‘నీతో కలిసి కాఫీ తాగాలి. చాలా మాట్లాడాలి’’ అని చెప్పేవాడు. నాకు ఏదోలా అనిపించి నేను కాఫీకి రానని చెప్పేశా. అప్పుడే తన విషయంలో ఏదో జరుగుతుందని గ్రహించా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అలాగే డివిలియర్స్‌ అంతకుముందెన్నడూ అలా మాట్లాడలేదని.. మాజీ సారథి వివరించాడు. ‘ఆ వాయిస్‌ మెసేజ్‌ వినగానే నేనూ భావోద్వేగానికి గురయ్యా. అతడితో ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచుకున్నాను. అయితే, మొన్ననే.. డివిలియర్స్‌ గురించి ఆలోచిస్తూ.. ఇకపై మేం ఎప్పుడు కప్పు గెలిచినా.. మొదట తననే గుర్తుచేసుకోవాలనుకున్నా. బెంగళూరు కప్పు గెలవడం డివిలియర్స్‌కు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అతడో అద్భుతమైన వ్యక్తి. బెంగళూరు ఫ్రాంఛైజీలో ప్రతి ఒక్కరి మనసు తాకాడు’ అని కోహ్లీ అన్నాడు. ఇక తాను ఎప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతానని, ఎంత మంది ఆటగాళ్లు వచ్చిపోయినా ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తానని చెప్పాడు. ఇక్కడ లభించిన ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ తనతోనే ఉంటాయన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని