IND vs SA: బుమ్రాతో పెట్టుకుంటే అంతే.. జాన్సన్‌ వికెట్‌ ఎగిరిపోవడం చూశారా?

టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా, దక్షిణాఫ్రికా పేసర్‌ మార్కో జాన్సన్‌ల మధ్య పోరు ఇంకా కొనసాగుతోంది. కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ అది రెండో రోజు...

Updated : 13 Jan 2022 14:44 IST

కేప్‌టౌన్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా, దక్షిణాఫ్రికా పేసర్‌ మార్కో జాన్సన్‌ల మధ్య పోరు ఇంకా కొనసాగుతోంది. కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ అది రెండో రోజు ఆటలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే, ఈసారి బుమ్రా ఆ సఫారీ ఆటగాడిపై ఆధిపత్యం సాధించడం విశేషం. జోహానెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో వీరిద్దరి మధ్య తొలిసారి మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్‌ చేస్తుండగా జాన్సన్‌ బౌన్సర్లు సంధించాడు. ఈ క్రమంలో పలు బంతులను శరీరానికేసి విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే అంపైర్లు కలగజేసుకొని ఇద్దర్నీ దూరం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

ఇకపోతే తాజాగా మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా బుమ్రా బౌలింగ్‌లో జాన్సన్‌ (7) ఔటయ్యాడు. టీమ్‌ఇండియా పేసర్ అతడికి ముందు పలు బౌన్సర్లు సంధించి ఉన్నట్టుండి ఒక బంతిని ఫుల్‌లెంగ్త్‌ డెలీవరిగా విసిరాడు. దీంతో ఆ బంతి వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను బలంగా తాకడంతో వికెట్‌ గాల్లో ఎగిరి పడింది. అది చూసిన జాన్సన్‌ అవాక్కయ్యాడు. బుమ్రా ఎప్పటిలాగే మౌనంగా దక్షిణాఫ్రికా ఆటగాడి ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇప్పుడీ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అభిమానులు దీన్ని రీట్వీట్‌ చేస్తూ రెండో టెస్టు నుంచే ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు.. బుమ్రాతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. టీమ్‌ఇండియా పేసర్‌ అతడిని ఎలా ఔట్‌ చేశాడో మీరూ చేసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని