2011 Final: 2011 ఫైనల్‌ కామెంట్రీ రీమిక్స్‌ చేసిన రవిశాస్త్రి.. వీడియో చూడండి

టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తన కామెంట్రీతో మరోసారి 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను గుర్తుచేశాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ధోనీ సారథ్యంలోని భారత జట్టు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో...

Updated : 03 Apr 2022 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తన కామెంట్రీతో మరోసారి 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను గుర్తుచేశాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ధోనీ సారథ్యంలోని భారత జట్టు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమ్‌ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆఖర్లో ధోనీ (91*) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన తీరు భారత అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ క్షణాలను మరింత మధురం చేస్తూ రవిశాస్త్రి పలికిన ‘ధోనీ ఫినిషెస్‌ ఇట్‌ ఆఫ్‌ ఇన్‌ స్టైల్‌’ అనే మాటలు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ మ్యాచ్‌ జరిగి శనివారం నాటికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా శాస్త్రి మరోసారి ఆ కామెంట్రీని వినిపించి అభిమానులను అలరించాడు. అయితే, అప్పుడు ఇంగ్లిష్‌లో కామెంట్రీ చేసిన శాస్త్రి ఇప్పుడు అవే పదాలను హిందీలో రీమిక్స్‌ చేసి చెప్పడం విశేషం.

ప్రస్తుతం ముంబయిలో జరుగుతోన్న టీ20 మెగా లీగ్‌లో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి గుజరాత్‌, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో సదరు ఛానల్‌ వ్యాఖ్యాత.. శాస్త్రీని 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ నాటి తన చివరి క్షణాల కామెంట్రీని హిందీలో చెప్పాలని కోరాడు. దానికి ధోనీ సిక్సర్‌ కొట్టిన వీడియోను జతచేశారు. దీంతో రవిశాస్త్రి అంగీకరించి అచ్చం ఆరోజు ఎలా చెప్పాడో.. అదే టోన్‌తో మరోసారి తన కామెంట్రీ మాధుర్యాన్ని అభిమానులకు రుచిచూపించాడు. అందుకు సంబంధించిన వీడియోను మాజీ కోచ్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ఇప్పుడది అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మ్యాచ్‌(టీ20 లీగ్‌)లో మరో వ్యాఖ్యాతగా ఉన్న నాటి ఛాంపియన్‌, ప్రముఖ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవడం సచిన్‌ తెందూల్కర్‌ చిరకాల కోరిక అని వెల్లడించాడు. ఇక మీరూ ఇప్పుడు రవిశాస్త్రి కామెంట్రీ వీడియోను చూసి నాటి మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని