RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్‌ చేయడంపై...

Published : 03 Jul 2022 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్‌ చేయడంపై సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సైతం అతడి ఆటతీరుకు ఫిదా అయ్యాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో బుమ్రా (4, 5 వైడ్లు, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) దంచికొట్టడంతో మొత్తం 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు బ్రియాన్‌ లారా, బెయిలీ, కేశవ్‌ మహారాజ్‌.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పంచుకున్న వీడియోలో శాస్త్రి మాట్లాడుతూ ఇది ఎవరూ ఊహించి ఉండరని అభిప్రాయపడ్డాడు.

‘ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు వచ్చినప్పుడు నేను కామెంట్రీ చేస్తున్నానని చెప్పకండి. యువీ 36 పరుగులు చేయడం, నేను కూడా 36 పరుగులు చేయడం పక్కన పెడితే.. ఈ రోజు నేను చూసింది అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం. మీరెప్పుడూ ఇలాంటి బ్యాటింగ్‌ ఊహించి ఉండరు. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా పదోస్థానంలో వచ్చిన బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌లో ఈ పాటికే మీరు అన్నీ చూశామని అనుకోవచ్చు. కానీ, మీరింకా విద్యార్థి అనే అనుకోవాలి. ఎందుకంటే మీరు చూడాల్సింది చాలా ఉందని గ్రహించాలి. ఏదో ఒక రోజు ఇంతకన్నా మెరుగైన రికార్డు మీరు చూస్తారు. ఈరోజు నేను చూసింది కూడా అలాంటిదే. 35 పరుగులు వచ్చిన ఓవర్‌లో బుమ్రా 29 పరుగులు సాధించాడు’ అని శాస్త్రి తనదైన స్టైల్‌లో పేర్కొన్నాడు. కాగా, బ్రాడ్‌ బౌలింగ్‌లోనే యువరాజ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని