Rishabh Pant: పంత్‌పట్టు జారింది... పాత జోకు మళ్లీ పేలింది!

టీమ్‌ఇండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ఆటకు, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ఆటకు పొంతనే లేదు. తన సహజసిద్ధమైన దూకుడు మంత్రాన్ని మార్చుకోకుండానే...

Updated : 14 Jan 2022 12:38 IST

కేప్‌టౌన్‌: రిషభ్‌ పంత్‌.. ఆ మధ్య ఓ స్టీల్‌ కంపెనీ యాడ్‌ చేశాడు గుర్తుందా? బ్యాటు పట్టు గురించి రిషభ్‌కి కౌంటర్‌ వేసేలా అందులో డైలాగ్‌ ఉంటుంది. ఆ రోజుల్లో ఆ యాడ్‌ మంచి హిట్‌. చూస్తే భలే నవ్వొస్తుంది కూడా. బంతిని బలంగా కొట్టే క్రమంలో రిషబ్‌ చేతి నుంచి బ్యాటు జారి అల్లంత దూరం పడుతుంది. తాజాగా మరోసారి పంత్‌ నుంచి అలాంటి ఫన్నీ ఫీట్‌ జరిగింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో పంత్‌ బౌండరీ కొట్టే క్రమంలో బ్యాటు గాల్లోకి ఎగిరింది. ఇప్పుడు ఆ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టెయిలెండర్లతో కలసి పంత్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న సమయం అది. సరైన బంతి దొరకడం ఆలస్యం బౌండరీకి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ఒలివర్‌ వేసిన బంతిని ఆఫ్‌ సైడ్‌ బౌండరీకి తరలించాడు. అయితే బ్యాటు చేతి నుంచి జారి లెగ్‌సైడ్‌ 30 అడుగుల సర్కిల్‌ దగ్గర పడింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో నవ్వులు విరిశాయి. ఆఖరికి పంత్‌ కూడా ఓ నవ్వు నవ్వేసి బ్యాటు తెచ్చుకున్నాడు. బ్యాటు గ్రిప్‌ సరిగ్గా లేకుండానే కొట్టిన షాట్‌ 4 వెళ్లిందంటే... పట్టు ఉండుండే 6 వెళ్లేదా అనిపించింది. 

పంత్‌ తన సహజసిద్ధమైన దూకుడు మంత్రాన్ని వదలకుండా, జాగ్రత్తగా ఆడుతూ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలోనే 139 బంతుల్లో 6 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకొని నాటౌట్‌గా నిలిచాడు. అయితే అవతలి ఎండ్‌ నుంచి సరైన సహకారం లేకపోవడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. 

ఇక ఆ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో వెరైటీ కామెంట్లు వస్తున్నాయి. ‘‘పంత్‌ బ్యాటు పడిన చోట ఫీల్డర్‌ లేకపోయాడు కాబట్టి సరిపోయింది... ఉంటే ఏమవునో’’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే, ఇంకొందరేమో ‘‘బ్యాటు అంత దూరం వెళ్లింది కదా అదనపు పరుగులు ఏమైనా ఇస్తారా?’’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే ‘‘పంత్‌ బ్యాటింగ్‌ మారినా...గ్రిప్‌ విషయంలో మాత్రం పాత స్టైలే’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఆ వెరైటీ షాట్‌ మీరూ చూసేయండి మరి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని