Shane Warne: షేన్‌వార్న్‌ ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ వైరల్‌ వీడియో చూడండి

లెగ్‌స్పిన్‌తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న షేన్‌వార్న్‌ బంతితో మాయ చేశాడు. ముఖ్యంగా లెగ్‌స్టంప్‌కు ఆవల బంతి వేస్తూ ఆఫ్‌ స్టంప్‌ను ముద్దాడేలా దాన్ని స్పిన్‌ చేయడంలో వార్న్‌ దిట్ట...

Published : 05 Mar 2022 07:24 IST

లెగ్‌స్పిన్‌తో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న షేన్‌వార్న్‌ బంతితో మాయ చేశాడు. ముఖ్యంగా లెగ్‌స్టంప్‌కు ఆవల బంతి వేస్తూ ఆఫ్‌ స్టంప్‌ను ముద్దాడేలా దాన్ని స్పిన్‌ చేయడంలో వార్న్‌ దిట్ట. అందుకే అతను వేసిన ఓ డెలివరీ ‘‘శతాబ్దపు మేటి బంతి’’గా చరిత్రలో నిలిచిపోయింది. ఇంగ్లాండ్‌తో 1993 యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టు ఆ అద్భుతానికి వేదికైంది. అప్పటికీ వార్న్‌కు 11 టెస్టుల అనుభవం మాత్రమే ఉంది. పైగా అది అతనికి తొలి యాషెస్‌ టెస్టు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓ వికెట్‌ పడ్డాక స్పిన్‌ను సమర్థంగా ఆడతాడనే పేరున్న మైక్‌ గాటింగ్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పుడే వార్న్‌ తొలి ఓవర్‌ వేసేందుకు సిద్ధమయ్యాడు. నెమ్మదిగా రనప్‌ చేసి వచ్చి మొదటి బంతి వేశాడు. నేరుగా వచ్చేలా కనిపించిన ఆ బంతి లెగ్‌స్టంప్‌ లైన్‌కు కొన్ని అంగుళాల ఆవల పడింది. ప్యాడు, బ్యాట్‌ను అడ్డుపెట్టి దాన్ని ఎదుర్కోవాలని గాటింగ్‌ చూశాడు. కానీ అనూహ్యంగా స్పిన్‌ అయిన ఆ బంతి.. ప్యాడు, బ్యాట్‌ను దాటి వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను తాకింది. ఏం జరిగిందో తెలీక గాటింగ్‌ ఆశ్చర్యంతో పిచ్‌ వైపు చూసి పెవిలియన్‌ బాట పడ్డాడు.

సచిన్‌తో మజాయే వేరు

సచిన్‌ బ్యాటింగ్‌ చూడటం, వార్న్‌ స్పిన్‌ బౌలింగ్‌ను వీక్షించడం.. క్రికెట్‌ అభిమానులందరికీ ఇష్టమైన వ్యాపకాలివి. మరి ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడితే..? 90వ దశకంలో వీళ్లిద్దరి పోరాటాలు పంచిన మజా అంతా ఇంతా కాదు. ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కు చెమటలు పట్టించిన వార్న్‌పై సచిన్‌దే పైచేయి కావడం విశేషం. ఆరంభంలో సచిన్‌ కూడా వార్న్‌ బౌలింగ్‌కు తికమక పడ్డవాడే. అయితే లెగ్‌ స్టంప్‌కు ఆవల, పిచ్‌ అంచులో బంతిని వేసి అనూహ్యంగా దాన్ని స్పిన్‌ చేసే వార్న్‌ను ఎలా ఎదుర్కోవాలో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కాక తలలు పట్టుకుంటున్న సమయంలో.. సచిన్‌ క్రీజు దాటి బయటికి వచ్చి బంతి పిచ్‌ అయ్యి అవ్వంగానే లాఫ్టెడ్‌ షాట్‌తో లాంగాన్‌, లాంగాఫ్‌లో బౌండరీ దాటించడం ద్వారా వార్న్‌ను ఎదుర్కొనే చిట్కాను నేర్పించాడు. అలాగే ప్యాడిల్‌ స్వీప్‌తో వార్న్‌ బంతుల్ని వికెట్ల వెనుక బౌండరీ బాట పట్టించడంలోనూ మాస్టర్‌ తన నైపుణ్యాన్ని చూపించాడు. వేరే వాళ్లు ఇలా ప్రయత్నించినా సచిన్‌లా వార్న్‌పై ఎవరూ ఆధిపత్యం చలాయించలేకపోయారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని