T20 World Cup: లైవ్‌ షోలో షోయబ్‌ అక్తర్‌కు అవమానం!

పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్‌ అక్తర్‌కు ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్‌ షోలో ఘోర అవమానం జరిగింది. ఊహించని పరిణామం ఎదురుకావడంతో అక్తర్ వెంటనే తాను ధరించిన మైక్రోఫోన్‌ని పక్కన పెట్టేసి బయటికి వచ్చేశాడు. అంతేకాదు ఆ ఛానెల్‌తో విశ్లేషకుడిగా ఉన్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు.

Updated : 28 Oct 2021 05:05 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్‌ అక్తర్‌కు ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్‌ షోలో ఘోర అవమానం జరిగింది. ఊహించని పరిణామం ఎదురుకావడంతో అక్తర్ వెంటనే తాను ధరించిన మైక్రోఫోన్‌ను పక్కన పెట్టేసి బయటికి వచ్చేశాడు. అంతేకాదు ఆ ఛానెల్‌తో విశ్లేషకుడిగా ఉన్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 26న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగింది. ఇందులో పాక్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం పీటీవీ ఛానెల్‌ నిర్వహించిన లైవ్‌ షోకి షోయబ్‌ అక్తర్‌ హాజరయ్యాడు. అతడితో పాటు సర్​ వివియన్​ రిచర్డ్స్​, డేవిడ్​ గోవర్​, రషీద్​ లతీఫ్​, ఉమర్ గుల్​, ఆకిబ్ జావేద్​ పాల్గొన్నారు. పాక్ బౌలర్లు హరీస్‌ రవూఫ్‌, షాహీన్‌ ఆఫ్రిదిపై అక్తర్‌ ప్రశంసలు కురిపిస్తుండగా.. ఆ టీవీ ఛానెల్ హోస్ట్‌ డాక్టర్‌ నౌమన్ నియాజ్‌ మధ్యలో కలుగజేసుకున్నాడు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు. 

షోయబ్‌ అక్తర్‌ వీటిని పట్టించుకోకుండా తన విశ్లేషణను కొనసాగించాడు. దీంతో నియాజ్‌కు విసుగొచ్చింది. షోయబ్‌తో తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దీన్ని సహించబోనని పేర్కొన్నాడు. షో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదంతా ప్రత్యక్షప్రసారం అవుతుండగానే అక్తర్​.. లేచి మైక్రోఫోన్​​ తీసేసి బయటకు వెళ్లిపోయాడు. అయితే, హోస్ట్​ నియాజ్​.. అక్తర్​ను తిరిగి పిలవడానికి గానీ, సముదాయించడానికి గానీ ప్రయత్నించలేదు. అక్తర్‌ వెళ్లిపోయిన తర్వాత షోను ఎప్పటిలాగానే  కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని