Chess Olympiad: చదరంగం గడుల్లో మనుషులే పావులుగా.. అద్భుత వీడియో చూడండి..!

చదరంగం అనేది ఓ ప్రాచీన క్రీడ. పూర్వకాలంలో రాజులు తమ ప్రత్యర్థులతో తలపడేటప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో.. వారిని ఎలా ఓడించాలో అనే విషయాలపై ఎక్కువగా దృష్టిసారించేవారు...

Published : 30 Jul 2022 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చదరంగం ఓ ప్రాచీన క్రీడ. పూర్వం రాజులు తమ ప్రత్యర్థులతో తలపడేటప్పుడు ఎలాంటి వ్యూహాలు రచించాలో.. వారిని ఎలా ఓడించాలో అనే విషయాలపై ఎక్కువగా దృష్టిసారించేవారు. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో అన్ని వైపులా ఓ కన్నేసి ఉంచేవారు. దీంతో ఎత్తులు, పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను ఓడించేవారు. ఈ క్రమంలోనే ఆ ఎత్తులు, పై ఎత్తుల జిమ్మిక్కులతో చదరంగం పుట్టుకొచ్చిందని చెబుతారు. ఆ తర్వాత అది క్రీడగా మారి అంతర్జాతీయ స్థాయిలో విశ్వవ్యాప్తమైందంటారు. యుద్ధభూమిలో సైనికులు, మంత్రులు, రాజులు ఎలా తలపడేవారో అచ్చం అలానే ఈ చదరంగంలోని గడుల్లో ఉండే పావులు ప్రత్యర్థులతో తలపడతాయి. ఆ అనుభూతిని కళ్లకు కట్టినట్లు చూపించారు తమిళనాడులోని పుదుకొట్టాయి జిల్లా కలెక్టర్‌ కవిత రాము. స్వతహాగా భరత నాట్య నృత్యకారిణి అయిన ఆమె ప్రస్తుతం జరుగుతున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌లో ఆరంభ వేడుకల్లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తనదైన ముద్ర వేశారు.

తమిళనాడులో నిర్వహిస్తున్న ఈ చెస్‌ ఒలింపియాడ్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల పాలనాధికారులు ఆరంభ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పుదుకొట్టాయ్‌ జిల్లా కలెక్టర్‌ అందరికన్నా భిన్నంగా ఆలోచించారు. దాన్ని ఓ అద్భుత ప్రదర్శనగా తీర్చిదిద్దారు. వివిధ రంగాలకు చెందిన కళాకారులను చదరంగంలోని పావులుగా మార్చి వారితో తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఆటలో భాగమైనట్లు చూపించారు. ఒక చదరంగం బోర్డుపై నలుపు, తెలుపు రంగుల్లో కూచిపూడి, భరత నాట్యం, మార్షల్‌ ఆర్ట్స్‌, సిలంబం వంటి కళాకారులను ఉంచి వారితోనే గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, సైనికులు, రాజులు, మంత్రుల వంటి పాత్రలతో తలపడినట్లు కార్యక్రమాన్ని రూపొందించారు. అందుకు సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్‌లో పంచుకోవడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. దానికి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని