
Lasith Malinga: వావ్.. అనిపించే మలింగ యార్కర్లు.. చూశారా.!
(Photo: ICC Twitter)
ఇంటర్నెట్ డెస్కు: తాజా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొనియాడింది. ‘కింగ్ ఆఫ్ ది యార్కర్’ అంటూ ప్రశంసించింది. ఈ సందర్భంగా కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించిన దృశ్యాలతో కూడిన ఓ వీడియోను ఐసీసీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోకు ‘యార్కర్ కింగ్’ అనే వ్యాఖ్యను జోడించింది.
38 ఏళ్ల మలింగ మంగళవారం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర స్పందిస్తూ ‘అద్భుతంగా సాగిన నీ కెరీర్‌కు శుభాకాంక్షలు. శ్రీలంక క్రికెట్‌కు, ప్రపంచ క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. నీతో కలిసి ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ లెజెండ్’ అని ట్వీట్ చేశాడు. శ్రీలంక తరఫున 226 వన్డేలు ఆడిన మలింగ 338 వికెట్లు పడగొట్టాడు. 30 టెస్టుల్లో 101 వికెట్లు, 84 టీ20 మ్యాచుల్లో 107 వికెట్లు తీశాడు.