Team India: 2019 వరల్డ్ కప్‌ సమయంలో ఇదే సమస్య ఎదురైంది: జహీర్‌ఖాన్

ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమ్‌ఇండియా మరోసారి సమీక్షించుకోవాలని భారత మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ (Zaheer Khan) సూచించాడు.

Published : 25 Mar 2023 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ మధ్య ప్రపంచకప్‌ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారతే ఆతిథ్యం ఇవ్వనుండటం విశేషం. 2019 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలైన టీమ్‌ఇండియా (Team India).. ఈ సారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలిచి మూడోసారి కప్‌ని ముద్దాడాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే, ప్రపంచకప్‌ సమీస్తున్న వేళ కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. దీనికితోడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇప్పటికీ కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడించడానికి పర్మినెంట్ ప్లేయర్‌ని గుర్తించలేకపోతోంది. ఈ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ ( Shreyas Iyer) నిలకడగా ఆడినా అతడు గాయాల బారినపడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. ఆసీస్‌తో జరిగిన  వన్డే సిరీస్‌లో శ్రేయస్‌ స్థానంలో ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌ (Zaheer Khan) కీలక సూచనలు చేశాడు. 2019 ప్రపంచకప్‌ సమయంలో టీమ్‌ఇండియా ఇలాంటి సమస్యనే ఎదుర్కొందని, వీలైనంత త్వరగా నాలుగో స్థానంలో ఆడేందుకు బ్యాటర్‌ని గుర్తించాలని సూచించాడు.  

‘‘బ్యాటింగ్ ఆర్డర్‌పై కచ్చితంగా మరోసారి సమీక్షించుకోవాలి. మళ్లీ నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్‌ని గుర్తించాలి.  ఇదే సమస్య 2019 ప్రపంచ కప్‌ సమయంలో కూడా ఎదురైంది.  నాలుగు సంవత్సరాల తర్వాత కూడా మనం అదే సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. నాలుగో స్థానంలో ఆడించేందుకు శ్రేయస్‌ అయ్యర్‌ని గుర్తించారని నాకు తెలుసు. అతడు తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. కానీ, శ్రేయస్‌ ఇప్పుడు గాయపడ్డాడు. అతడు దీర్ఘకాలం గాయం నుంచి కోలుకోకపోతే ఈ సమస్య నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలను వెతకాల్సి ఉంటుంది’’ అని జహీర్‌ఖాన్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని