Teamindia: విశ్రాంతి లేదు.. అందరూ ఆడాల్సిందే: పాండ్యపై కోచ్‌ కామెంట్‌

పాక్‌తో ఇన్నింగ్స్‌లో కాస్త అలసటగా కనిపించిన పాండ్య తర్వాత పుంజుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ అంశంపై టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌  పరాస్‌ మాంబ్రే స్పందించాడు.

Published : 27 Oct 2022 01:54 IST

దిల్లీ: పాక్‌తో మ్యాచ్‌లో ఘనవిజయం అందుకున్న టీమ్‌ఇండియా అక్టోబర్‌ 27న తన రెండో మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఫిట్‌నెస్‌ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌లో కాస్త అలసటగా కనిపించిన పాండ్య తర్వాత పుంజుకున్నాడు. దీంతో రెండో మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడా? అనే అనుమానాలు తలెత్తాయి. తాజాగా ఈ అంశంపై టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌  పరాస్‌ మాంబ్రే స్పందించాడు. పాండ్య సహా జట్టులో ఏ ఒక్కరికీ విశ్రాంతి ఇవ్వబోమని స్పష్టం చేశాడు. 

‘‘ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో టీమ్ఇండియా రాణిస్తోంది. ఈ సమయంలో ఏ ఒక్క ఆటగాడికీ విశ్రాంతిని ఇవ్వలేం. ప్రతి ఒక్కరూ వారి ఫామ్‌ను కొనసాగించాల్సిందే. హార్దిక్‌ బాగానే ఉన్నాడు. ఆడటానికి అవసరమైన ఫిట్‌నెస్‌ ఉంది. అంతేగాక అతడు అన్ని మ్యాచులను ఆడాలనుకుంటున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడు. పాక్‌తో ఆడిన ఇన్నింగ్స్‌లో సైతం కోహ్లీతో పాటు అదరగొట్టాడు. జట్టులో పాండ్య ఉండటం మాకెంతో కీలకం’’ అని మాంబ్రే వివరించాడు.  గాయాల కారణంగా కొంత కాలం జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్‌ తనపై వస్తున్న వార్తలపై ఇటీవల స్పందించాడు. తిరిగి జట్టులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్‌ పరంగా చాలా బాగున్నానని,  ఇక ఇప్పటికైనా తన విశ్రాంతి గురించి మాట్లాడటం మానేయాలని విజ్ఞప్తి చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని