Harshal Patel : అప్పుడు లీగ్‌ మధ్యలోనే ఇంటికి పంపించేశారు: హర్షల్‌ పటేల్

ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌లో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ఎదిగిన...

Published : 27 Apr 2022 11:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌లో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ఎదిగిన బౌలర్‌ హర్షల్‌ పటేల్‌. గత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈసారి కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. 2012వ సీజన్‌ నుంచి హర్షల్‌ పటేల్‌ ఆడుతున్నాడు. అయితే మూడు సీజన్లలో మాత్రమే పూర్తిస్థాయిలో మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఇందులో చాలా కాలంపాటు బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు.  ఈ క్రమంలో గతంలో తనను టీ20 లీగ్ మధ్యలోనే ఇంటికి పంపించిన సందర్భాన్ని హర్షల్‌ గుర్తు చేసుకున్నాడు.

‘‘2016 సీజన్‌లో నేను కేవలం ఐదు మ్యాచ్‌లను మాత్రమే ఆడా. అలానే 2017లోనే ఇదే పరిస్థితి. మధ్యలో ఓసారి ఇంటికి కూడా వెళ్లా. ఓ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోకుండా తమతో ఉంచుకుంటే హోటల్‌ రూమ్‌, రోజువారీ అలవెన్సులు, ఫ్లైట్‌ టికెట్లు.. ఇలా యాజమాన్యం చాలా వెచ్చించాలి. నాకు ఇప్పటికీ గుర్తు ఆ రోజు ఏం జరిగిందనేది. ‘డానియల్ వెటోరీ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు’’ అని చెప్పడంతో వెళ్లి కలిశాను. ‘నాలుగైదు మ్యాచ్‌లు కంటే ఎక్కువ ఆడించలేకపోతున్నాం. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాం. నిన్ను ఇంటికి పంపిద్దామని అనుకుంటున్నాం. నువ్వు జట్టులో కూడా లేవు’ అని చెప్పాడు. నన్ను తిరస్కరించడానికి ఇదే కారణంగా వివరించాడు. 

‘‘ఇక 2017 సీజన్‌లో బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాలేదు. అప్పటికి ఇంకా నాలుగైదు మ్యాచ్‌లు ఉన్నాయనుకుంటా. నాకు ఒక ఛాన్స్‌ ఇవ్వండి అని వెటోరికి మెసేజ్ చేశా.  దిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చారు. అయితే మొదటి ఓవర్‌లోనే 14 పరుగులు ఇచ్చా. అయితే చివరికి మూడు వికెట్లు తీసుకోవడంతోపాటు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యా. ఆ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. మరుసటి ఏడాది (2018) వేలం జరిగితే దిల్లీ కొనుగోలు చేసింది’’ అని హర్షల్‌ గుర్తు చేసుకున్నాడు. మరోసారి 2021లోనూ బెంగళూరు తరఫున ఆడిన హర్షల్‌ ఆ సీజన్‌లో 32 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని