IND vs NZ: ఆత్మ పరిశీలన చేసుకొంటాం.. బలంగా తిరిగి వస్తాం: శ్రేయస్‌ అయ్యర్

తొలి వన్డేలో ఇద్దరు బ్యాటర్లు కివీస్‌ను గెలిపించగా.. భారత బౌలర్లు వికెట్లను పడగొట్టడంలో విఫలమయ్యారు. తొలి మూడు వికెట్లను త్వరగానే తీసిన బౌలర్లు.. ఆ తర్వాత పట్టు వదిలేశారు. దీంతో న్యూజిలాండ్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఇరు జట్ల మధ్య కీలకమైన రెండో వన్డే జరగనుంది.

Updated : 26 Nov 2022 13:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 సిరీస్‌ను నెగ్గిన భారత్‌కు షాక్‌ ఇస్తూ కివీస్‌ తొలి వన్డేలో అద్భుత విజయం సాధించింది. లాథమ్‌ (145*), కేన్ విలియమ్సన్ (94*) విజృంభించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 306/7 స్కోరు చేసినా.. ఓటమి తప్పలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (72), శుభ్‌మన్ గిల్ (50)తోపాటు శ్రేయస్‌ అయ్యర్ (80) అర్ధశతకాలు సాధించారు. అయితే బౌలింగ్‌లో విఫలం కావడంతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.  ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్  మాట్లాడుతూ.. భారత్‌ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి న్యూజిలాండ్‌తో ఆడటం తేలికైన విషయం కాదన్నాడు. 

‘‘కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. అయితే కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకొని.. కొత్త ఆలోచనలతో ముందుకొస్తాం. ప్రాంతాలను బట్టి పిచ్‌లు మారుతుంటాయి. కివీస్‌ పిచ్‌ల మీద ఆడటం సవాల్‌తో కూడుకున్నదే. అయితే మానసికంగా బలంగా ఉంటాం. పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాం. భారీ లక్ష్య ఛేదనలో లాథమ్, కేన్ అద్భుతంగా ఆడారు. ఏ బౌలర్‌ను టార్గెట్‌ చేసుకోవాలో వారిద్దరికి తెలుసు. వారిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. వికెట్‌ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది. లాథమ్‌ 40వ ఓవర్‌లో దూకుడు పెంచాడో.. అప్పటికే మ్యాచ్‌ వారికి అనుకూలంగా మారిపోయింది. ఎప్పుడైనా సరే మ్యాచ్‌ ఆడే విధానం చాలా కీలకం. భవిష్యత్తు గురించి మరీ తీవ్రంగా ఆలోచించను. ఇప్పుడు నేను ఏం చేయగలనో దానిపైనే దృష్టిసారిస్తా. ఆటగాళ్ల కెరీర్‌లో ఎత్తుపల్లాలు సాధారణం. ప్రతి మ్యాచ్‌ నుంచి నేర్చుకొంటూనే ఉంటాం’’ అని పేర్కొన్నాడు. ఆదివారం హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని