IND Vs BAN : ఓటమికి సాకులు చెప్పట్లేదు.. మా బ్యాటింగ్‌ విధానాన్ని మార్చుకోవాలి: రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ వైఫల్యంపై మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. తమ బ్యాటింగ్‌ విధానంపై ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

Updated : 05 Dec 2022 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  తొలి వన్డేలో (IND Vs BAN)బంగ్లాదేశ్‌ ఆఖరి వికెట్‌ పడగొట్టలేక.. ఓటమిని మూటగట్టుకుంది టీమ్‌ఇండియా(Team India). దీంతో చేతులదాకా వచ్చిన భారత్‌ విజయాన్ని బంగ్లా లాగేసుకుంది. ఇక ఈ ఓటమిలో ప్రధానంగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ వైఫల్యంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit sharma)స్పందించాడు. తమ బ్యాటింగ్‌ విధానంపై ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

‘పిచ్‌ కాస్త సవాలుతో కూడకున్నది. బంతి టర్న్‌ అవుతోంది. అయితే.. ఓటమికి ఎలాంటి సాకులు చెప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో అర్థం చేసుకోవాలి. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో మా బ్యాటింగ్‌ యూనిట్‌ అవసరమైన మార్పులు చేసుకోవాలి. వాళ్లకి ఇలాంటి పరిస్థితులు అలవాటే. అయితే.. ఒత్తిడిని అధిగమించడమే ఇక్కడ ముఖ్యం’ అని రోహిత్‌ అన్నాడు. ఇక తమ బ్యాటింగ్‌ ప్రదర్శనపై స్పందిస్తూ..‘నిజంగా ఇది సరిపోయే స్కోరు కాదు. ఇంకో 30, 40 పరుగులు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. దురదృష్టం కొద్ది మేం మిడిల్‌లో వికెట్లు కోల్పోయాం. తిరిగి ఆటలోకి రావడం అంత సులభం కాదు’ అని వివరించాడు.

అయితే బౌలర్ల ప్రదర్శనను హిట్‌మ్యాన్‌ మెచ్చుకున్నాడు. ‘చివరి 30 నిమిషాల ఆటను మినహాయిస్తే.. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇది చాలా క్లోజ్‌ గేమ్‌. ఆటలో తిరిగి పుంజుకునేందుకు బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు. బంగ్లా వికెట్లను తీయడం కొనసాగించాం. అయితే చివరి ఓవర్లలో అది సాధ్యపడలేదు. చివరి వరకూ ప్రత్యర్థిపై ఒత్తిడి ఉంచగలిగాం. మా బ్యాటింగే సరిగా లేదు’ అని రోహిత్‌ అంగీకరించాడు.

రెండో మ్యాచ్‌ కూడా మీర్పూర్‌ వేదికగానే జరగనుంది. తొలి మ్యాచ్‌ వైఫల్యాల నుంచి నేర్చుకుని రెండో మ్యాచ్‌కు పుంజుకుంటామని రోహిత్‌(Rohit sharma) విశ్వాసం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని