FIFA World Cup 2022: ‘మాకు బీర్‌ కావాలి’.. నినాదాలతో హోరెత్తించిన ఈక్వెడార్ అభిమానులు

ఫిఫా ప్రపంచకప్‌ 2022 మెగా టోర్నీ ఖతార్‌ వేదికగా ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. అయితే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఖతార్‌ ఓటమిపాలైంది. ఈక్వెడార్‌ చేతిలో 2-0 తేడాతో పరాజయం పాలైంది. ఈ సందర్భంగా ఈక్వెడార్‌ అభిమానులు సందడి చేశారు.

Updated : 21 Nov 2022 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 2022 తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఖతార్‌పై ఈక్వెడార్‌ 2-0 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ చరిత్రలో ఆతిథ్యం ఇచ్చిన దేశం తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. దాదాపు 70వేల సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఆల్‌ బయత్‌ స్టేడియంలో ఎక్కువ మంది ఖతార్‌ అభిమానులే ఉన్నారు. అయినా ఈక్వెడార్‌పై విజయం సాధించడంలో ఖతార్‌ విఫలమైంది.

మ్యాచ్‌ ముగింపు దశకు వచ్చేసరికి చాలా మంది ఖతార్‌ అభిమానులు సీట్లను వదిలి వెళ్లిపోయారు. అయితే ఈక్వెడార్‌ అద్భుత విజయం సాధించడంతో ఆ జట్టు ఫ్యాన్స్‌ సంబరాలు అంబరాన్ని తాకాయి. ‘మాకు బీర్‌ కావాలి’ అంటూ ఈక్వెడార్‌ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలి మ్యాచ్‌లోనే తమ జట్టు విజయం సాధించిందని, అందుకే తమకు బీర్‌ కావాలంటూ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేశారు. అయితే స్టేడియం పరిసరాల్లో ఆల్కహాల్ ఉత్పత్తుల అమ్మకాలపై ఫిఫా ప్రపంచకప్‌ నిర్వాహకులు నిషేధించిన విషయం తెలిసిందే. దోహా, దుబాయ్‌లో మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసిన ఫిఫా ఫ్యాన్‌ ఫెస్టివల్‌ ప్రాంతాల్లో మాత్రమే ప్రేక్షకులు ఆల్కహాల్‌ను తాగేందుకు  అవకాశం ఉంది.

అభిమానులను నిరాశకు గురి చేశాం: ఖతార్‌ కోచ్

ఈక్వెడార్‌ చేతిలో ఓటమిపాలైన తర్వాత ఖతార్‌ కోచ్‌ ఫెలిక్స్‌ సాంచెజ్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ‘‘మాకు మద్దతుగా నిలిచిన అభిమానులను నిరాశకు గురి చేశాం. తర్వాతి మ్యాచ్‌లో తప్పకుండా గర్వపడేలా చేస్తాం. మ్యాచ్‌లో తప్పిదాలపై సమీక్షించుకొని ముందుకు సాగుతాం’’ అని వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని